నిరీక్షణ ముగిసేనా!

1 Jun, 2019 14:01 IST|Sakshi

ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్‌కు అంతగా కలిసి రాలేదు. సైనా నెహ్వాల్‌ టైటిల్‌ నెగ్గడం మినహా ఇప్పటివరకు పురుషుల సింగిల్స్‌లో ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు టైటిల్‌ సాధించలేకపోయారు. విపరీతమైన పోటీ, కీలక సమయాల్లో తడబాటు, ఇంకా కుదురుకోని కొత్త కోచ్‌లు... ఇతరత్రా కారణాలతో భారత ఆటగాళ్లు ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. అయితే ఈనెల నాలుగు నుంచి జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనైనా పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు విజయం సాధించి టైటిల్‌ నిరీక్షణకు ముగింపు పలుకుతారో లేదో వేచి చూడాలి.  

సాక్షి, హైదరాబాద్‌: సుదర్మిన్‌ కప్‌లో నిరాశాజనక ఫలితాల తర్వాత భారత బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు మరోఅంతర్జాతీయ టోర్నమెంట్‌కు సంసిద్ధమయ్యారు. ఈనెల నాలుగున సిడ్నీలో మొదలయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత బృందం శుక్రవారం బయలుదేరింది. అందుబాటులో ఉన్న ‘డ్రా’ ప్రకారం పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, సమీర్‌ వర్మ బరిలో ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో రైజింగ్‌ స్టార్‌ లక్ష్య సేన్‌ పోటీపడుతున్నాడు. భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఈ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో ఏడో టోర్నమెంట్‌లో ఆడనున్న సాయిప్రణీత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది స్విస్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన సాయిప్రణీత్‌ ఆ తర్వాత ఆశించినరీతిలో ఆడలేకపోయాడు.

కశ్యప్, ప్రణయ్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్‌లో లిన్‌ డాన్‌తో ప్రణయ్‌; సుపన్యు అవింగ్‌సనోన్‌తో కశ్యప్‌ ఆడతారు. ఒకవేళ వీరిద్దరు గెలిస్తే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. సాయిప్రణీత్‌ తొలి రౌండ్‌లో లీ డాంగ్‌ కెయున్‌ (కొరియా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అతనికి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) ఎదురయ్యే చాన్స్‌ ఉంది. మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో పీవీ సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి రౌండ్‌లో సింధు క్వాలిఫయర్‌తో ఆడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి; మను అత్రి–సుమీత్‌ రెడ్డి జోడీలు తొలి రౌండ్‌లోనే ముఖాముఖిగా తలపడనున్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి జంట బరిలోకి దిగనుంది.   

మరిన్ని వార్తలు