కోహ్లి ఆడకపోతే ఎలా?

17 Sep, 2018 05:10 IST|Sakshi

ఆసియా కప్‌లో భారత కెప్టెన్‌ గైర్హాజరీపై స్టార్‌ స్పోర్ట్స్‌ అసంతృప్తి

జోక్యం చేసుకోవద్దన్న బీసీసీఐ

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్థాయి ఏంటో కొత్తగా చెప్పనవసరంలేదు. మ్యాచ్‌ ఫలితాలు ఎలా ఉన్నా అతను ఆడుతుంటే దేశం మొత్తం మ్యాచ్‌ చూడటం మాత్రం ఖాయం. ఇప్పుడతను సుదీర్ఘ షెడ్యూల్‌ నుంచి విశ్రాంతి కోరుకుంటూ ఆసియా కప్‌కు దూరమయ్యాడు. దాంతో ప్రసారకర్తలైన స్టార్‌ స్పోర్ట్స్‌ గుండెల్లో రాయి పడింది! అసలే అంతంత మాత్రం ఆదరణ ఉండే ఆసియా కప్‌లో కోహ్లిలాంటి స్టార్‌ కూడా లేకపోతే సహజంగానే రేటింగ్‌లపై ప్రభావం పడుతుందని స్టార్‌ భావిస్తోంది. ఇదే విషయంపై ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ)కి స్టార్‌ సంస్థ లేఖ రాసినట్లు సమాచారం. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగితే భారత్‌ మాత్రం కోహ్లిని పక్కన పెట్టిందని... ఏసీసీతో తాము చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని ఆరోపించింది.

గతంలో కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్‌లు రావడం, అతను ఔట్‌ కాగానే పడిపోయిన విషయాన్ని కూడా స్టార్‌ గుర్తు చేసింది. భారీ మొత్తం చెల్లించి ఏసీసీతో ఎనిమిదేళ్ల కాలానికి స్టార్‌ ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్‌కు విశ్రాంతినివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమతో పాటు టోర్నీతో సంబంధం ఉన్న అనేక సంస్థలకు వాణిజ్యపరంగా నష్టదాయకమని పేర్కొంది. అయితే దీనిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ‘బీసీసీఐ అంతర్గత వ్యవహారాలతో స్టార్‌కు ఎలాంటి సంబంధం లేదు. మా సెలక్షన్‌ ప్రక్రియ విషయంలో వారి జోక్యం అనవసరం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో మంగళవారం హాంకాంగ్‌తో, ఆ తర్వాత బుధవారం పాకిస్తాన్‌తో తలపడుతుంది. 

మరిన్ని వార్తలు