స్లిప్‌లో దగ్గరగా నిలబడుతున్నారు:వీవీఎస్ లక్ష్మణ్

18 Aug, 2014 01:36 IST|Sakshi
స్లిప్‌లో దగ్గరగా నిలబడుతున్నారు:వీవీఎస్ లక్ష్మణ్

వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్య

లండన్: స్లిప్‌లో భారత ఫీల్డర్లు ఒకరికొకరు చాలా దగ్గరగా నిలబడుతున్నారని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. దీనివల్ల క్యాచ్‌లు తీసుకునే విషయంలో వాళ్ల మధ్య గందరగోళం నెలకొంటుందన్నాడు. ఐదో టెస్టు రెండో రోజు కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను స్లిప్‌లో విజయ్, రహానే జారవిడిచిన సంగతి తెలిసిందే.

‘మేం ఆడేటప్పుడు మూడు స్లిప్‌ల మధ్య కాస్త ఖాళీ ఉంచేవాళ్లం. కానీ ప్రస్తుతం చాలా దగ్గరగా నిల్చుంటున్నారు. ఉపఖండంలో ఆడేటప్పుడు వికెట్ నుంచి ఆరు అడుగులు వెనక్కి ఉండాలి. అదే విదేశాల్లో అయితే ఇది 7, 8 అడుగులు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బంతి బౌన్స్ ఎక్కువగా అవుతుంది.
 
ఏదేమైనా స్లిప్ ఫీల్డర్ల మధ్య కొంతైనా ఖాళీ మాత్రం ఉండాల్సిందే’ అని స్లిప్ ఫీల్డింగ్ స్పెషలిస్ట్ లక్ష్మణ్ వెల్లడించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం బ్యాటింగ్, బౌలింగ్ మాదిరిగా చాలా ఆత్మవిశ్వాసంతో కూడుకున్నదని చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్లిప్ ఫీల్డర్లలో ఇది కొరవడిన కారణంగానే క్యాచ్‌లు మిస్సవుతున్నాయన్నాడు.

అయితే క్యాచ్‌లు తీసుకునే సామర్థ్యం వాళ్లలో ఉందని కితాబిచ్చాడు. ‘గతంలో విజయ్, రహానే అద్భుతమైన క్యాచ్‌లు తీసుకున్నారు. కాకపోతే నిలకడ ఉండాలి. స్లిప్ ఫీల్డర్లను ధోని పదేపదే మార్చకూడదు. దీని కోసం ప్రత్యేక ఆటగాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మ్యాచ్ కీలక దశలో క్యాచ్‌లను జారవిడిచారు. దీనివల్ల ఇంగ్లండ్ సిరీస్‌లో పుంజుకుంది’ అని లక్ష్మణ్ వివరించాడు.

మరిన్ని వార్తలు