విరామం మంచిదేనా!

6 Apr, 2020 04:12 IST|Sakshi

భారత క్రీడాకారుల ఫిట్‌నెస్, ఫామ్‌ కష్టాలు

సుదీర్ఘ విరామం చేటు చేసే అవకాశం

గాయాల నుంచి కోలుకుంటున్న కొందరు

న్యూజిలాండ్‌ పర్యటనలో గాయపడిన భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ఇటీవలే కోలుకున్నాడు. కివీస్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమైన అతను ఐపీఎల్‌ కోసం సన్నద్ధమయ్యాడు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. రోహిత్‌ మాటల్లోనే చెప్పాలంటే... ‘ముంబైలో నేను ఉండే ఫ్లాట్‌ 54 అంతస్తుల భవనంలో ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇందులో ఉండే అధునాతన జిమ్‌లను మూసివేశారు. నేను అనుకున్నా సరే, బయటకు వెళ్లే అవకాశం లేదు. ఏదో నాలుగు అంతస్తులు అలా పైకి, కిందకి పరుగెత్తడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో మరింత మెరుగైన ఫిట్‌నెస్‌ ప్రణాళిక అమలు చేసి ఉంటే బాగుండేది’ అంటూ తన అసంతృప్తిని ప్రదర్శించాడు.

కివీస్‌తో పోరుకు ముందే గాయం నుంచి కోలుకున్న పేసర్‌ బుమ్రా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అతనూ తన బాధను రోహిత్‌తో పంచుకున్నాడు. క్రికెటేతర క్రీడాకారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తదితరులు ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌కే పరిమితమయ్యారు. పరిస్థితులు అనుకూలిస్తే ఫామ్‌లోకి రావడానికి మళ్లీ ప్రాక్టీస్‌ మొదలు పెడతారు. అసలు ఈ అనూహ్య విరామం ఆటగాళ్లకు చేటు చేస్తోందా లేక విశ్రాంతి కూడా మంచిదేనా అనే చర్చ ఇప్పుడు క్రీడా వర్గాల్లో వినిపిస్తోంది.

సాక్షి క్రీడా విభాగం: సాధారణంగా బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఉండే క్రికెటర్లకు, క్రీడాకారులకు ఇప్పుడు కరోనా కారణంగా ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే అవకాశం లభించింది. చాలా మంది సీనియర్‌ క్రికెటర్లు, ఇతర క్రీడాంశాల్లోని స్టార్‌ ప్లేయర్లు ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటే మరికొందరు మాత్రం విరామం మంచిదే అంటూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే గాయం నుంచి కోలుకుంటున్న కొందరు భారత క్రికెటర్లు లాక్‌డౌన్‌ తమకు మేలు చేసినట్లు భావిస్తున్నారు. ‘ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌ సమయంలో ఎక్కువ మంది ఆటగాళ్లు పట్టించుకోని ప్రధాన అంశం విశ్రాంతి. మీ ప్రదర్శన మెరుగవ్వాలంటే విరామం కూడా చాలా కీలకం. లేదంటే వైద్య పరిభాషలో చెప్పే ఓవర్‌ ట్రెయినింగ్‌ సిండ్రోమ్‌కు గురవుతారు. అప్పుడు వారి ఆట మరింత దిగజారుతుంది. కాబట్టి నా దృష్టిలో క్రికెటర్లకు విరామం లభించడం మంచిదే. ఇది వారి కెరీర్‌ను పొడిగించుకునేందుకు ఉపయోగపడుతుంది’ అని సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ ఆశిష్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. గతంలో దశాబ్దకాలం పాటు విదర్భ క్రికెట్‌ జట్టుకు పని చేసిన అగర్వాల్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో కూడా సేవలందించారు.

గత ఏడాది కాలంగా బిజీ షెడ్యూల్‌ కారణంగా పలువురు భారత క్రికెటర్లు గాయాలపాలయ్యారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, పేసర్లు బుమ్రా, భువనేశ్వర్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ జాబితాలో ఉన్నారు. ఆటగాళ్లు ఇంటి వద్ద గడపడం మంచిదే కానీ... ప్రొఫెషనల్‌ క్రీడాకారులకు ఇంత సుదీర్ఘ విరామం చేటు చేస్తుందని స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ వీపీ సుదర్శన్‌ చెబుతున్నారు. ‘ఎలైట్‌ అథ్లెట్లు వరుసగా మూడు రోజుల పాటు ట్రెయినింగ్‌ చేయకపోతే వారి ప్రదర్శన కనీసం ఐదు శాతం తగ్గుతుంది. ఇంత సుదీర్ఘ విరామం వల్ల తగినంత విశ్రాంతి లభించిందని వారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మైదానంలోకి అడుగు పెట్టాక వారి ఫిట్‌నెస్‌ అదే స్థాయిలో ఉంటుందా అనేది సందేహమే’ అని సుదర్శన్‌ అభిప్రాయపడ్డారు. అత్యున్నత స్థాయి సౌకర్యాలతో నిపుణుల పర్యవేక్షణలో ట్రెయినింగ్‌కు అలవాటు పడిన భారత క్రికెటర్లు ఇంటి దగ్గర ఏదో ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు చేసుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని, అది వారిని ఫిట్‌గా ఉంచేందుకు సరిపోదని ఆయన అంటున్నారు.

అయితే తీరిక లేని కార్యక్రమాలతో అలసిపోయే భారత క్రికెటర్లకు ఇప్పుడు శారీరక ఫిట్‌నెస్‌కంటే మానసిక ఉల్లాసమే ఎక్కువ ముఖ్యమని, ఎలాంటి ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ లేకుండా కుటుంబ సభ్యులతో గడిపితే చాలు, వారు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగగలరని ప్రముఖ ఫీల్డింగ్‌ కోచ్‌ బిజూ జార్జ్‌ విశ్లేషించారు. లాక్‌డౌన్‌ కారణంగా అకాడమీలు మూతబడటంతో... భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తన శిష్యులు శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేందుకు వాట్సాప్‌ ద్వారా రోజువారీ షెడ్యూల్‌ను పంపిస్తున్నారు. ఒకటి మాత్రం స్పష్టం. క్రీడాకారులకు తాము కోరుకోకుండానే లభించిన ఈ విరామం ఎప్పటి వరకు, ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలీదు. కానీ వారు ఎప్పుడు బరిలోకి దిగినా అభిమానులు మాత్రం వారిని పూర్తి ఫిట్‌గా, మైదానంలో చురుగ్గా కనిపించాలని కోరుకుంటారు. దానిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆటగాళ్ళదే.

ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నమెంట్‌లో పాల్గొని వచ్చాక 21 రోజులపాటు క్వారంటైన్‌లోనే ఉన్నాను. ఆదివారంతో స్వీయ నిర్బంధం ముగిసింది. ఫిట్‌నెస్‌ కోసం రోజూ ఇంట్లోనే కొంతసేపు తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నాను.  ప్రాక్టీస్‌ చేయకుండా ఖాళీగా ఉంటున్నందుకు కండరాల్లో కదలికలు ఉండవు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ కోల్పోతాం. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ రావడానికి సమయం పడుతుంది. –‘సాక్షి’తో సింధు

నేను రోజూ ఇంట్లోనే రెండు గంటలపాటు ఫిజికల్‌ ట్రెయినింగ్‌ చేస్తున్నాను. టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేయడంలేదు. అయితే టోర్నమెంట్‌లు మొదలయ్యే సమయానికి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను సంతరించుకోలేమన్నది వాస్తవం. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. –‘సాక్షి’తో సానియా మీర్జా

మరిన్ని వార్తలు