చార్మినార్ ... కోహినూర్‌

22 Sep, 2019 03:18 IST|Sakshi

హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ లోగో ఆవిష్కరణ  

హైదరాబాద్‌: ఈ సీజన్‌ నుంచి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో కాలిడనున్న ‘హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ)’... శనివారం తమ అధికారిక లోగోను ఆవిష్కరించింది. నగరానికి తలమానికమైన చార్మినార్ నేపథ్యంగా, విఖ్యాత కోహినూర్‌ వజ్రాన్ని పోలిన ఆకృతిలో ఈ లోగో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దీనికి ‘హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ఖ్యాతిని పునరుద్ధరించడం’ అని శీర్షిక ఇచ్చారు. ఈ సందర్భంగా క్లబ్‌ సహ యజమాని వరుణ్‌ త్రిపురనేని మాట్లాడుతూ... ‘ఫుట్‌బాల్‌లో హైదరాబాద్‌కు 1910 నుంచి మంచి గుర్తింపు ఉంది.

1920–1950 మధ్య అయితే భారత్‌ ఫుట్‌బాల్‌ను శాసించింది’ అని అన్నారు. ‘హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ విశేష ఆదరణ చూరగొంటుందని మాకు నమ్మకం ఉంది. నగరంలో సందడి వాతావరణం నెలకొనడం ఖాయం’ అని మరో సహ యజమాని విజయ్‌ మద్దూరి తెలిపారు. హైదరాబాద్‌ చరిత్రను దృష్టిలో పెట్టుకుని లోగోను డిజైన్‌ చేశామని, హెచ్‌ఎఫ్‌సీతో ఈ ప్రాంతంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. ఐఎస్‌ఎల్‌ ఆరో సీజన్‌ అక్టోబరు 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబరు 25న హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా (ఏటీకే)తో కోల్‌కతాలో తలపడతుంది

మరిన్ని వార్తలు