గోల్‌కీపర్‌ నిర్లక్ష్యం...

22 Dec, 2019 01:01 IST|Sakshi

గెలవాల్సిన మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఆటగాళ్ల శ్రమను జట్టు గోల్‌ కీపర్‌ కమల్‌జీత్‌ సింగ్‌ వృథా చేశాడు. సొంత మైదానంలో గెలవాల్సిన చోట తన నిర్లక్ష్యంతో హైదరాబాద్‌ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకునేలా చేశాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) సీజన్‌–6 ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా శనివారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అట్లెటికో డి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 90వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడి నుంచి బంతి అందుకున్న కమల్‌జీత్‌... అవసరం లేకపోయినా బంతిని గాల్లోకి తన్నాడు. అయితే ఆ బంతి గతి తప్పి నేరుగా హైదరాబాద్‌ ‘డి’ బాక్స్‌ ముందే కాచుకొని ఉన్న ప్రత్యర్థి కోల్‌కతా ప్లేయర్‌ హెర్నాండెజ్‌ దగ్గరికి వెళ్లడం... అతను హెడర్‌తో కృష్ణ రాయ్‌కు పాస్‌ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

కృష్ణ ఎటువంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్‌ పోస్టులోకి పంపి స్కోరును 2–2తో సమం చేశాడు. దీంతో మైదానంలోని హైదరాబాద్‌ అభిమానులు షాక్‌కు గురయ్యారు. మైదానంతా ఒక్కసారిగా మూగబోయింది. కమల్‌జీత్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జట్టు డిఫెండర్, భారత జట్టు సభ్యుడైన ఆదిల్‌ ఖాన్‌ ఆగ్రహంతో గోల్‌కీపర్‌ మీదకు దూసుకెళ్లగా... అక్కడే ఉన్న సహచర ఆటగాళ్లు అతనిని నిలువరించారు. అంతకుముందు 15వ నిమిషంలో కృష్ణ రాయ్‌ గోల్‌తో కోల్‌కతా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో బోబో గోల్‌తో హైదరాబాద్‌ స్కోరును సమం చేసింది. అనంతరం 85వ నిమిషంలో బోబో మళ్లీ గోల్‌ చేయడంతో హైదరాబాద్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ చివరి క్షణాల్లో గోల్‌కీపర్‌ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌ గోల్‌ను సమరి్పంచుకుంది.

మరిన్ని వార్తలు