తుది జట్టులో పేస్‌

26 Feb, 2020 03:59 IST|Sakshi

క్రొయేషియాతో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌కు అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. మార్చి 6, 7 తేదీల్లో జాగ్రెబ్‌లో క్రొయేషియా జట్టుతో జరిగే డేవిస్‌ కప్‌ టీమ్‌ టెన్నిస్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో పాల్గొనే ఐదుగురు సభ్యులతో భారత తుది జట్టును ఏఐటీఏ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌)కు పంపించింది. 24 జట్లు పాల్గొనే క్వాలిఫయర్స్‌లో గెలిచిన 12 జట్లు ఈ ఏడాది చివర్లో జరిగే డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి. సింగిల్స్‌లో భారత టాప్‌–3 ర్యాంకర్లు సుమీత్‌ నాగల్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, రామ్‌కుమార్‌ రామనాథన్‌... డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్న, నాలుగో ర్యాంకర్‌ లియాండర్‌ పేస్‌లను భారత జట్టులో ఎంపిక చేశామని ఏఐటీఏ తెలిపింది. డబుల్స్‌లోభారత రెండో ర్యాంకర్‌ దివిజ్‌ శరణ్‌ను రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ‘ఈ సీజన్‌లో పేస్‌ బాగా రాణిస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. టాటా ఓపెన్‌లో దివిజ్‌ శరణ్‌ జంటపై పేస్‌ జోడీ గెలిచింది. బెంగళూరు ఓపెన్‌ చాలెంజర్‌ టోర్నీలో పేస్‌ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది పేస్‌ కెరీర్‌లో చివరిది. 30 ఏళ్లుగా దేశానికి సేవ అందిస్తున్న వ్యక్తికి అత్యున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అతడిని ఎంపిక చేశాం. దివిజ్‌ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు’ అని భారత నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ తెలిపారు. డేవిస్‌ కప్‌లో క్రొయేషియా, భారత్‌ తలపడనుండటం ఇది రెండోసారి మాత్రమే. 1995లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–2తో క్రొయేషియాను ఓడించింది. ఈ పోటీలో పేస్‌ సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగి విజయం సాధించాడు.

మరిన్ని వార్తలు