కమాన్‌ ఇండియా...

2 Apr, 2018 04:30 IST|Sakshi

రెండేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత క్రీడాకారులు చివరకు రెండు పతకాలతో సరిపెట్టుకొని నిరాశపరిచారు. రియో ఒలింపిక్స్‌ తర్వాత ‘గోల్డ్‌ కోస్ట్‌’ కామన్వెల్త్‌ గేమ్స్‌ రూపంలో మరో మెగా ఈవెంట్‌లో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలతో పోలిస్తే కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీ తక్కువే. దాంతో కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత ఆటగాళ్లు తమ జోరును ఇక్కడా కొనసాగించి పతకాల పంట పండించాలని పట్టుదలతో ఉన్నారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు 15 స్వర్ణాలు లభించగా... ఈసారి మనోళ్ల నుంచి క్రితంకంటే మెరుగైన ప్రదర్శన ఆశించడంలో తప్పేమీ లేదు.  

ఇప్పటివరకు భారత్‌ 16 సార్లు కామన్వెల్త్‌ గేమ్స్‌లో బరిలోకి దిగింది. గత నాలుగు గేమ్స్‌లలో భారత ప్రదర్శన స్థిరంగా ఉంది. 2010లో సొంతగడ్డపై జరిగిన ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియా తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 39 స్వర్ణాలతో కలిపి మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. కానీ 2014 గ్లాస్గో గేమ్స్‌లో స్వర్ణాల సంఖ్య 15కు పడిపోయింది. అయితే ఆస్ట్రేలియా లోని గోల్డ్‌ కోస్ట్‌ నగరం వేదికగా ఈనెల 4న మొదలయ్యే క్రీడల్లో భారత్‌ పసిడి పతకాల సంఖ్య పెరిగే అవకాశముంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, స్క్వాష్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్‌ క్రీడాంశాల నుంచి భారత్‌కు కచ్చితంగా స్వర్ణాలు ఆశించవచ్చు.

పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌ (74 కేజీలు), బజరంగ్‌ పూనియా (65 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీలు), బబిత కుమారి (53 కేజీలు), సాక్షి మలిక్‌ (62 కేజీలు) పసిడి ఆశలు ఉన్నాయి.   ఇక భారత షూటర్లు ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మెక్సికోలో జరిగిన సీనియర్‌ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఈ గేమ్స్‌లో భారత షూటర్ల గురికి కనీసం ఏడెనిమిది స్వర్ణాలు రావడం ఖాయమనిపిస్తోంది.

మహిళల విభాగంలో మను భాకర్, హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌), అపూర్వీ చండేలా, మెహులీ ఘోష్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), అంజుమ్‌ (50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్, త్రీ పొజిషన్‌)... పురుషుల విభాగంలో జీతూ రాయ్, ఓంప్రకాశ్‌ (10 మీటర్ల, 50 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌)... మానవ్‌జిత్‌ సంధూ (ట్రాప్‌), అంకుర్‌ మిట్టల్‌ (డబుల్‌ ట్రాప్‌), గగన్‌ నారంగ్, రవి కుమార్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌) పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు.  

బాక్సింగ్‌లో మేరీకోమ్‌ (48 కేజీలు), సరితా దేవి (60 కేజీలు)... వికాస్‌ కృషన్‌ (75 కేజీలు) పంచ్‌లకు పసిడి పతకాలు వచ్చే అవకాశముంది.   బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ ఆటగాళ్లందరూ బరిలో ఉండటంతో కనీసం మూడు స్వర్ణాలు రావడం ఖాయమనిపిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిలపై భారీ అంచనాలు ఉన్నాయి.
వెయిట్‌ లిఫ్టింగ్‌లో సతీశ్‌ శివలింగం (77 కేజీలు), మీరాబాయి చాను (48 కేజీలు)... స్క్వాష్‌లో దీపిక పళ్లికల్, జోష్నా చినప్ప, సౌరవ్‌ ఘోషాల్‌... టేబుల్‌ టెన్నిస్‌లో సీనియర్‌ ప్లేయర్‌ ఆచంట శరత్‌ కమల్‌... జిమ్నాస్టిక్స్‌లో ఆశిష్‌ కుమార్‌... అథ్లెటిక్స్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణాలు అందించే సత్తా గలవారే. హాకీలో పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ జట్లపై కనబరిచే ప్రదర్శన ఆధారంగా భారత పురుషుల, మహిళల జట్ల స్వర్ణ పతక అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.   

1 కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణం 1958లో లభించింది. ఆ క్రీడల్లో అథ్లెట్‌ మిల్కా సింగ్‌ 400 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచాడు. –సాక్షి క్రీడావిభాగం

మరిన్ని వార్తలు