అమ్మో...టీమిండియా చాలా కష్టం!

22 Oct, 2019 14:01 IST|Sakshi

రాంచీ: ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టును చూస్తుంటే ఓడించడం ఏ జట్టుకైనా అంత ఈజీ కాదని అంటున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌. టీమిండియాతో మూడో టెస్టులో  దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దాంతో తమ క్రికెట్‌  చరిత్రలో నాల్గో అతిపెద్ద పరాజయాన్ని చవిచూశారు సఫారీలు. ఈ మ్యాచ్‌లో విజయంతో టీమిండియా 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఫలితంగా సఫారీలపై తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. మ్యాచ్‌ తరువాత డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. ‘ విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా చాలా బలంగా ఉంది. ఆ జట్టును ఓడించడం చాలా కష్టం.

బ్యాటింగ్‌, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌ల్లో కూడా భారత జట్టు మామూలుగా లేదు. ఈ పర్యటన మాకు కఠినతరంగా మారింది.  మళ్లీ భారత్‌కు రాబోయే పర్యటన నాటికి మా జట్టు రాటుదేలాల్సిన అవసరం ఉంది.  ప్రధానంగా ఈ సిరీస్‌లో భారత సీమర్లు ఇరగదీశారు. టీమిండియా పేసర్లతో మా సీమర్లు పోటీపడలేకపోయారు. ఇది వాస్తవం. మా వాళ్లు తొలి 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ప్రభావం చూపితే, భారత సీమర్లు మాత్రం రోజంతా తమ వాడిని కొనసాగిస్తున్నారు. దాంతోనే మేము సిరీస్‌ను ఘోరంగా కోల్పోయాం. భారత బ్యాటింగ్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాం.. అదే సమయంలో భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయాం కూడా’ అని డుప్లెసిస్‌ మ్యాచ్‌ తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులోని యువ ఆటగాళ్లు రాబోవు 3 నుంచి 4 ఏళ్లలో రాటుదేలతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు