భారత బాక్సర్ల పసిడి పంచ్‌ 

4 Feb, 2020 01:56 IST|Sakshi

బోరస్‌ (స్వీడన్‌): గోల్డెన్‌ గర్ల్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించి అదరగొట్టారు. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్‌ విభాగంలో ఐదు పసిడి పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించగా... యూత్‌ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకుంది. జూనియర్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రాచీ (50 కేజీలు) ‘బెస్ట్‌ బాక్సర్‌’ అవార్డును కైవసం చేసుకుంది.

ఆమెతో పాటు నివేదిత (48 కేజీలు), ఎథోయ్‌బి చాను వాంజమ్‌ (54 కేజీలు), లశు యాదవ్‌ (66 కేజీలు), మహి (80 కేజీలు) బంగారు పతకాలను గెల్చుకోగా... యూత్‌ విభాగంలో ముస్కాన్‌ (54 కేజీలు) స్వర్ణాన్ని సాధించింది. సాన్యా (57 కేజీలు), దీపిక (64 కేజీలు), ముస్కాన్‌ (69 కేజీలు), సాక్షి (75 కేజీలు) కాంస్యాలు గెలిచారు. జూనియర్‌ విభాగంలో జాన్వీ (46 కేజీలు), రూడీ లాల్‌మింగ్‌ మువాని (66 కేజీలు), తనిష్కా (80 కేజీలు) రజతాలు... దియా(60 కేజీలు) కాంస్యం సాధించింది.

మరిన్ని వార్తలు