మహిళల హాకీ సెమీస్‌లో భారత్‌

26 Aug, 2018 04:48 IST|Sakshi

జకార్తా: ఆట ఆఖరు దశలో మూడు నిమిషాల్లో మూడు గోల్స్‌ కొట్టి... ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. శనివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–1తో జయభేరి మోగించింది. నవనీత్‌ కౌర్‌ 16వ నిమిషంలోనే గోల్‌ కొట్టి భారత్‌ ఖాతా తెరిచింది. మరికొద్దిసేపటికే యురియ్‌ లీ (20వ ని.) పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు సమమైంది. తర్వాత చాలాసేపటి వరకు ఇరు జట్ల నుంచి గోల్స్‌ నమోదు కాలేదు.  అయితే... 54, 55 నిమిషాల్లో పెనాల్టీ కార్నర్‌లను నెట్‌లోకి పంపి గుర్జీత్‌ కౌర్‌ భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. వందనా కటారియా (56వ ని.) ఫీల్డ్‌ గోల్‌తో ప్రత్యర్థికి అందనంత ఎత్తున జట్టును నిలిపింది. పూల్‌ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ లనూ గెలిచిన భారత్‌ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్‌ తలపడనుంది.

క్వార్టర్స్‌లో పవిత్ర
భారత మహిళా బాక్సర్‌ పవిత్ర (60 కేజీలు) ఆసియా క్రీడల క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పవిత్ర 10–8తో పర్వీన్‌ రుక్సానా (పాకిస్తాన్‌)పై విజయం సాధించింది. బౌట్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన పవిత్ర ప్రత్యర్థిని రెండు సార్లు నాక్‌డౌన్‌ చేయడంతో రిఫరీ ఆమెను విజేతగా ప్రకటించారు.   

ఆర్చరీలో అదే కథ
ఆర్చరీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరోసారి తడబడ్డారు. రికర్వ్‌ విభాగంలో శనివారం జరిగిన పురుషుల, మహిళల టీమ్‌ విభాగాల్లో భారత జట్లు క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. జగదీశ్‌ చౌదరి, అతాను దాస్, విశ్వాస్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 1–5తో కొరియా చేతిలో ఓడగా... దీపిక, ప్రమీల, అంకితలతో కూడిన మహిళల బృందం 2–6తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడింది.
 
షూటింగ్‌ గురి తప్పింది
పోటీలు మొదలైన తర్వాత వరుసగా ఆరు రోజులు కనీసం ఒక పతకమైనా నెగ్గిన భారత షూటర్లకు శనివారం ఒక్క పతకం కూడా దక్కలేదు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో బరిలో దిగిన 15 ఏళ్ల అనీశ్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 576 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మరో భారత షూటర్‌ శివమ్‌ శుక్లా 569 పాయింట్లతో 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత ఏప్రిల్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌లో అనీశ్‌ స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించాడు. కానీ అలాంటి ఫలితాన్ని ఆసియా క్రీడల్లో పునరావృతం చేయలేకపోయాడు.     

మరిన్ని వార్తలు