మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు!

16 Jun, 2018 16:37 IST|Sakshi
హాకీ టీమిండియా కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (ఫైల్‌ ఫోట్‌)

మాడ్రిడ్‌ : స్పెయిన్‌తో  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత మహిళల హాకీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. కీలక సమయంలో టీమిండియా కెప్టెన్‌ రాణి రాంపాల్‌ గోల్ సాధించడంతో భారత్‌ విజయాన్ని అందుకుంది. చివరి వరకు  ఉత్కంఠభరితంగా సాగిన  మ్యాచ్‌లో చివరకు భారత్‌నే విజయం వరించింది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే స్పెయిన్‌ క్రీడాకారిణి మారియా లోపెజ్‌ గోల్‌ చేసి భారత్‌ జట్టుకు షాక్‌ ఇచ్చారు.

అనంతరం పుంజుకున్న భారత జట్టు నాలుగు నిమిషాల వ్యవధిలో వరుసగా రెండు గోల్స్‌ (గుర్జీత్‌ కౌర్‌, నవనీత్‌) చేసి 2-1తో లీడ్‌లోకి వచ్చింది.  అయితే ఆట 58వ నిమిషంలో స్పెయిన్‌ ప్లెయర్‌ లోలా రియిరా మరో గోల్‌ చేసి స్కోర్‌ సమం చేశారు. ఇక మ్యాచ్‌ డ్రా అవుతుందనుకున్న సమయంలో రాణి రాంపాల్‌ (59వ నిమిషంలో) గోల్‌ చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో 3-0తో స్పెయిన్‌ గెలవగా, రెండో మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఇక టీమిండియా నాలుగో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది.

వందన అరుదైన ఘనత      
ఫార్వర్డ్ క్రీడాకారిణి వందన కటారియా అరుదైన ఘనత సాధించారు. స్పెయిన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌ ఆడుతున్న  వందనకు 200వ అంతర్జాతీయ మ్యాచ్‌. ఈ అరుదైన మ్యాచ్‌లో 42వ నిమిషంలో గోల్‌ చేసే అవకాశం వందనాకు వచ్చినా దాన్ని ఆమె తృటిలో మిస్‌ చేసుకున్నారు. 2009లో అరంగేట్రం చేసిన ఈ 26 ఏళ్ల ఉత్తర ప్రదేశ్‌ క్రీడాకారిణి.. గతంలో టీమిండియాకు నేతృత్వం కూడా వహించారు. అద్భుత ఫార్వర్డ్‌ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు