పోరాడి ఓడిన భారత మహిళలు

18 May, 2017 01:27 IST|Sakshi
పోరాడి ఓడిన భారత మహిళలు

న్యూజిలాండ్‌దే హాకీ సిరీస్‌

ప్యూకేకొహే: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 2–3 గోల్స్‌ తేడాతో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3–0తో కివీస్‌ కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌లో 2–8 గోల్స్‌ తేడాతో చిత్తుగా ఓడిన భారత్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకుంది. పటిష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగిన టీమిండియా సత్తాచాటింది. దీంతో తొలి క్వార్టర్‌లోనే భారత్‌ బోణీ కోట్టింది. తొమ్మిదో నిమిషంలో జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను దీప్‌గ్రేస్‌ ఎక్కా గోల్‌గా మలివడంతో 1–0తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసిన ఆతిథ్యజట్టు 2–1తో తొలిక్వార్టర్‌ను ముగించింది.

ముందుగా 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను ఎల్లా గన్సన్‌ గోల్‌గా మలిచింది. అనంతరం దియాన్న రిచీ ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో కివీస్‌ ఆధిక్యాన్ని దక్కించుకుంది. మరోవైపు స్కోరు సమంచేసేందుకు భారత్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో 39వ నిమిషంలో షిలో గ్లోన్‌ గోల్‌ చేయడంతో 3–1తో కివీస్‌ తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 59వ నిమిషంలో జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మోనికా గోల్‌గా మలవడంతో కివీస్‌ ఆధిక్యాన్ని 3–2కు భారత్‌ తగ్గించింది. ఆట చివరి క్షణాల్లో గోల్‌కోసం భారత్‌ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో కివీస్‌ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ రేపు (శుక్రవారం) జరుగనుంది.

సునీతా లక్రా సెంచరీ
భారత డిఫెండర్‌ సునీతా లక్రా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం కివీస్‌తో మ్యాచ్‌ ద్వారా 100 అంతర్జాతీయ మ్యాచ్‌ల్ని సునీత పూర్తి చేసుకుంది. 2009లో అరంగేట్రం చేసిన సునీతా ఎనిమిదేళ్ల కెరీర్‌లో భారత జట్టుకు వెన్నెముకలా మారింది. 17వ ఆసియా గేమ్స్, రియో ఒలింపిక్స్, ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీల్లో జట్టు తరఫున కీలకపాత్ర పోషించింది. వంద మ్యాచ్‌ల్ని పూర్తి చేసుకున్న సునీతను హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి ముస్తాక్‌ అహ్మద్‌ అభినందించారు. తనో ప్రతిభాశాలీ అని, చాలా మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిందని ఆయన కొనియాడారు.

మరిన్ని వార్తలు