బౌలింగ్‌ కోచ్‌ కోసం బీసీసీఐ అన్వేషణ

26 Apr, 2018 18:47 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) బౌలింగ్‌ కోచ్‌ కోసం అన్వేషిస్తోంది. అయితే బీసీసీఐ అన్వేషించేది పురుషుల క్రికెట్‌ జట్టు కోసం కాదులెండీ.. భారత మహిళా క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ వనరులు మెరుగుపరచడం కోసం. ఈ మేరకు మహిళా జట్టు మేనేజ్‌మెంట్‌ బీసీసీఐకి ఒక ప్రతిపాదన పంపింది. దాంతో త్వరలోనే మహిళ జట్టు బౌలింగ్‌ కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానించనుంది. ప్రస్తుతం భారత మహిళా జట్టుకు తుషార్‌ అర్థో జట్టుకు ప్రధాన కోచ్‌గా, బిజు జార్జ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

‘బౌలింగ్‌ కోచ్‌ కావాలని మహిళా క్రికెట్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ విన్నవించింది. అందుకోసం త్వరలోనే అన్వేషణ ప్రారంభమవుతుంది’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు  తెలిపారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. భారత్‌కు చెందిన వారే కోచ్‌గా దరఖాస్తు చేసుకునే కానక్కర్లేదని ఆయన పేర్కొన్నారు.  ఇటీవల దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్టులో ఫీల్డింగ్‌ లోపాలు బాగా కనిపించాయి. దాంతో మహిళా క్రికెట్‌ జట్టు భవిష్యత్తులో ఆడే టోర్నీలను దృష్టిలో పెట్టుకుని కూడా బీసీసీఐ ఫీల్డింగ్‌ కోచ్‌ ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు