చేజేతులా... 

10 Mar, 2019 00:03 IST|Sakshi

మూడో టి20లో ఒక పరుగు తేడాతో ఓడిన భారత మహిళల జట్టు

చివరి ఓవర్‌లో 3 పరుగులు చేయలేకపోయిన టీమిండియా

సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌ 

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు టి20 సిరీస్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. చివరిదైన మూడో మ్యాచ్‌లో విజయం అంచుల్లో నిలిచి కూడా టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకొని సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. ఆఖరి ఓవర్‌లో విజయం కోసం 3 పరుగులు చేయాల్సిన భారత మహిళల జట్టు ఒక్క పరుగు మాత్రమే చేసి అనూహ్యంగా ఓడిపోయింది.   

గువహటి: గెలవాల్సిన మ్యాచ్‌ను ఎలా ఓడిపోవాలో భారత మహిళల జట్టు శనివారం ఓడి చూపించింది. ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచిన ఇంగ్లండ్‌ సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 118 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్‌లో భారత విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి. నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో భారత వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (32 బంతుల్లో 30 నాటౌట్‌; 4 ఫోర్లు) ఉన్నప్పటికీ ఆమెకు ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం. స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న భారత బ్యాటర్‌ భారతి ఫుల్మాలి (13 బంతుల్లో 5)... ఇంగ్లండ్‌ బౌలర్‌ కేట్‌ క్రాస్‌ వేసిన ఈ ఓవర్లో తొలి మూడు బంతులను వృథా చేసింది. నాలుగో బంతికి భారీ షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో ష్రబ్‌సోల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. భారతి స్థానంలో వచ్చిన అనూజా పాటిల్‌ (0) సింగిల్‌ తీసి మిథాలీ రాజ్‌కు స్ట్రయికింగ్‌ ఇవ్వాలని ఆలోచించలేదు. భారీ షాట్‌ ఆడేందుకు క్రీజ్‌ వదిలి ముందుకొచ్చిన అనూజాను ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ ఆమీ ఎలెన్‌ జోన్స్‌ స్టంపౌంట్‌ చేసింది. దాంతో విజయ సమీకరణం ఒక బంతికి 3 పరుగులుగా మారింది. చివరి బంతిని ఎదుర్కొనేందుకు క్రీజ్‌లోకి వచ్చిన శిఖా పాండే ఒక పరుగు మాత్రమే చేయగలిగింది. దాంతో భారత ఓటమి ఖాయంకాగా... నమ్మశక్యంకాని రీతిలో గెలిచినందుకు ఇంగ్లండ్‌ జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు.  

మెరిసిన స్మృతి మంధాన... 
అంతకుముందు భారత కెప్టెన్‌ స్మృతి మంధాన మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. 39 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 58 పరుగులు చేసింది. 13వ ఓవర్‌ చివరి బంతికి స్మృతి ఔటయ్యే సమయానికి భారత స్కోరు 87. అప్పటికి భారత్‌ నెగ్గాలంటే 42 బంతుల్లో 33 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కానీ మిథాలీ రాజ్‌ కూడా నింపాదిగా ఆడటం... ఇతర బ్యాటర్లు బంతులు వృథా చేయడంతో భారత్‌ విజయానికి చేరువై దూరమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసింది. డానియెలా వ్యాట్‌ (22 బంతుల్లో 24; ఫోర్, సిక్స్‌), టామీ బీమోంట్‌ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్‌), ఆమీ జోన్స్‌ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హర్లీన్‌ డియోల్, అనూజా పాటిల్‌ రెండేసి వికెట్లు తీశారు. కేట్‌ క్రాస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... డానియెలా వ్యాట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.   

మరిన్ని వార్తలు