భారత మహిళల శుభారంభం

20 Sep, 2018 01:27 IST|Sakshi

లంకతో తొలి టి20లో గెలుపు

మెరిసిన తానియా, జెమీమా, పూనమ్‌ 

గాలె: శ్రీలంకపై వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి టి20లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), తానియా భాటియా (35 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అనుజా పాటిల్‌ (36; 5 ఫోర్లు) చెలరేగడంతో... టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. స్మృతి మంధాన (0) తొలి ఓవర్‌లోనే వెనుదిరగడంతో క్రీజులోకొచ్చిన జెమీమా వచ్చి రావడంతోనే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది.

మరో ఓపెనర్‌ మిథాలీ రాజ్‌ (17)తో కలిసి రెండో వికెట్‌కు 4 ఓవర్లలో 57 పరుగులు జోడించింది. ఈ క్రమంలో వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్స్‌లు కొట్టిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. హైదరాబాదీ పేసర్‌ అరుంధతి రెడ్డి అరంగేట్రం మ్యాచ్‌లో ఓ వికెట్‌ పడగొట్టింది. రెండో మ్యాచ్‌ శుక్రవారం కొలంబోలో జరుగనుంది.   

మరిన్ని వార్తలు