హాకీ వరల్డ్ లీగ్‌కు సౌందర్య, రజని

26 May, 2015 03:11 IST|Sakshi

    వచ్చే నెలలో బెల్జియంలో టోర్నీ  
     టాప్-4లో నిలిస్తే ఒలింపిక్స్‌కు అర్హత
 న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ దశ పోటీల్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాలో తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్‌కీపర్ రజని ఎతిమరపులకు స్థానం లభించింది. రీతూ రాణి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... దీపికకు వైస్ కెప్టెన్సీని అప్పగించారు. జూన్ 20 నుంచి జూలై 4 వరకు బెల్జియంలో జరిగే ఈ మెగా టోర్నీలో భారత్‌కు పూల్ ‘బి’లో చోటు కల్పించారు. ఇదే గ్రూప్‌లో బెల్జియం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోలండ్‌లు ఉన్నాయి. పూల్ ‘ఎ’లో నెదర్లాండ్స్, కొరియా, జపాన్, ఇటలీ, అజర్‌బైజాన్ జట్లు ఉన్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సంవత్సరం జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. భారత జట్టు: సవిత, రజని, దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, సునీతా లాక్రా, నమిత, సుశీలా, రీతూ రాణి, లిలిమా మింజ్, లిలీ చాను, నవ్‌జ్యోత్ కౌర్, మోనిక, రేణుకా యాదవ్, రాణి, పూనమ్ రాణి, వందన, అనూరాధ, సౌందర్య.
 

మరిన్ని వార్తలు