భారత్కు రెండో విజయం

23 Jul, 2016 15:52 IST|Sakshi
భారత్కు రెండో విజయం

మన్హీమ్(అమెరికా):భారత మహిళల హాకీ జట్టు తమ అమెరికా పర్యటనలో రెండో విజయాన్ని సాధించింది. గత మ్యాచ్లో అమెరికాను ఓడించి సిరీస్లో బోణీ కొట్టిన భారత్.. తాజాగా జరిగిన మ్యాచ్లో కెనడా ఓడించి వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది. భారత  కాలమాన ప్రకారం శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 5-2 తేడాతో కెనడాను బోల్తాకొట్టించింది.  వందనా కటారియా (9, 51వ నిమిషం), దీపికా చానూ (38, 49వ నిమిషం) తలో రెండు గోల్స్ సాధించగా, పూనమ్ రాణి(58వ నిమిషం) ఒక గోల్ చేసి భారత ఘన విజయానికి సహకరించారు.

ఈ పోరులో ఆది నుంచి భారత మహిళలు ఆధిపత్యం కొనసాగించి కెనడాను ఒత్తిడిలోకి నెట్టారు.  తొలి క్వార్టర్ ఆదిలో పెనాల్టీ కార్నర్ను గోల్ గా మలచే అవకాశాన్ని జారవిడుచుకున్న భారత్.. స్వల్ప వ్యవధిలోనే వందన ఫీల్డ్ గోల్ తో  భారత్కు ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో క్వార్టర్ ఆరంభంలో కెనడా క్రీడాకారిణి స్టెఫానీ నార్లాండర్ గోల్ సాధించడంతో స్కోరు సమం అయ్యింది. కాగా, రెండో అర్ధభాగంలో వందనా గోల్ చేయడంతో భారత్ 2-1 తో ముందంజ వేసింది. ఆపై నాలుగు నిమిషాల వ్యవధిలోనే బ్రీన్నె స్టైర్స్ గోల్ చేయడంతో కెనడా మరోసారి స్కోరును సమం చేసింది. ఆట 49వ నిమిషంలో దీపికా రెండో గోల్ చేయగా, రెండు నిమిషాల వ్యవధిలో వందన గోల్ సాధించింది. దీంతో భారత్ 4-2తో పైచేయి సాధించింది. ఇక ఆట రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా పూనమ్ గోల్ చేయడంతో భారత్ ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ ఆదివారం జరుగనుంది.

మరిన్ని వార్తలు