బ్యాడ్మింటన్‌పై ‘కరోనా’ 

8 Feb, 2020 02:38 IST|Sakshi

ఆసియా చాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకున్న భారత మహిళల జట్టు

న్యూఢిల్లీ: ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరగనున్న ఆసియా చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి భారత మహిళల జట్టు తప్పుకుంది. ఫిలిప్పీన్‌ దేశంలోనూ ‘కరోనా వైరస్‌’ వేగంగా వ్యాప్తి చెందుతుండటమే అందుకు కారణం. ఈ నెల 11 నుంచి 16 వరకు టోర్నీ జరగాల్సి ఉంది. ‘కరోనా కారణంగా గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. ఆసియా బ్యాడ్మింటన్‌ సమాఖ్యతో కూడా దీనిపై చర్చించాం. అనంతరం మన మహిళల జట్టు టోర్నీలో పాల్గొనకుండా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ప్రకటించింది.

స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఇంతకు ముందే ఈ టోర్నీకి దూరం కాగా అస్మిత చలీహా, మాల్విక బన్సోడ్, పుల్లెల గాయత్రి తదితర యువ క్రీడాకారిణులతో  కూడిన భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు పురుషుల జట్టు మాత్రం చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని ‘బాయ్‌’ వెల్లడించడం విశేషం. సాయిప్రణీత్, శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్‌ తదితరులతో పూర్తి స్థాయి పురుషుల జట్టు టోర్నీ బరిలోకి దిగుతోంది. వీరంతా ఈ నెల 9న మనీలా బయల్దేరతారు.

మరిన్ని వార్తలు