నేను చేసిన తప్పేంటో వెతుకుతున్నా 

6 Jul, 2020 03:13 IST|Sakshi

భారత మహిళల రెజ్లింగ్‌ కోచ్‌ ఆండ్రూ కుక్‌ వివరణ

న్యూఢిల్లీ: భారత మహిళల రెజ్లింగ్‌ కోచ్‌ పదవి నుంచి తనను తప్పించడానికి గల కారణమేమిటో తనకు ఇంకా అంతుపట్టడం లేదని ఆండ్రూ కుక్‌ పేర్కొన్నాడు. రెప్పపాటులో మొత్తం మారిపోయిందని అతనన్నాడు. ఈ చర్య ద్వారా భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తనకు తీరని నష్టం చేసిందని  కుక్‌ ఆరోపించాడు. ఆన్‌లైన్‌ సెషన్‌లకు కుక్‌ గైర్హాజరు కావడంతోనే అతన్ని కోచ్‌ పదవి నుంచి తప్పించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ పేర్కొనగా... ఆ సెషన్‌ కోసం తాను ఉదయం 3 గంటలకే నిద్రలేచి సిద్ధంగా ఉన్నట్లు ఆండ్రూ కుక్‌ వెల్లడించాడు.

కరోనా నేపథ్యంలో స్వదేశం అమెరికా వెళ్లిన కుక్‌  భారత రెజ్లర్ల కోసం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నానని తెలిపాడు. ‘భారత్‌ నన్ను పూర్తిగా దెబ్బతీసింది. మళ్లీ నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురుకావొద్దని కోరుకుంటున్నా. నిజంగా అసలేం జరిగిందో నాకు తెలియదు. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు. ఆన్‌లైన్‌ తరగతుల కోసం నేను ఉదయం 3 గంటల సమయంలోనూ అందుబాటులో ఉన్నా. ఆ సెషన్‌కు రెజ్లర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇంత చేసినా నన్ను పదవి నుంచి తప్పించినట్లు మీడియాలో చూసి తెలుసుకున్నా. ఇప్పటికీ సాయ్, డబ్ల్యూఎఫ్‌ఐ నుంచి నాకు అధికారికంగా ఎలాంటి సందేశం రాలేదు. చాలా నిరాశగా ఉంది’ అని కుక్‌ వివరించాడు.

మరిన్ని వార్తలు