భారత్ పసిడి 'పట్టు'

8 Feb, 2016 19:09 IST|Sakshi
భారత్ పసిడి 'పట్టు'

గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది.  ప్రత్యేకంగా సోమవారం ముగిసిన రెజ్లింగ్ పోరులో భారత్ ఆరు పతకాలను సాధించి తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఇందులో ఐదు స్వర్ణ పతకాలను భారత రెజ్లర్లు సాధించగా, ఒక రజతాన్ని దక్కించుకున్నారు.  దీంతో మొత్తంగా రెజ్లింగ్ లో 14 పసిడి పతకాలను,  రెండు రజతాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వీటిలో భారత పురుషులు ఆరు స్వర్ణ పతకాలను, రెండు రజత పతకాలను సాధించగా, మహిళా రెజ్లర్లు ఎనిమిది స్వర్ణపతాకాలను కైవసం చేసుకున్నారు.

ఈరోజు జరిగిన రెజ్లింగ్ పోరులో భారత మహిళా రెజ్లర్ షిల్పి షీరాన్ స్వర్ణంతో బోణి చేసింది. 63కేజీల విభాగంలో బంగ్లాదేశ్ క్రీడాకారిణి ఫర్జానా షర్మిన్ ను ఓడించి షీరాన్ పసిడిని సాధించింది. అనంతరం రజని(69 కేజీల విభాగం), నిక్కీ(75 కేజీల విభాగం)లు పసిడి పతకాలు సాధించారు. ఆపై పురుషుల పోరులో మౌసమ్ ఖత్రి(97 కేజీల విభాగం), ప్రదీప్(74కేజీల విభాగం)లు పసిడి పట్టు పట్టగా, మన్ దీప్(125 కేజీల విభాగం) రజతంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం భారత్ 46 స్వర్ణాలు, 17 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 69 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు