ఒకే మ్యాచ్‌లో 263 పాయింట్లు..

5 Oct, 2019 04:07 IST|Sakshi

సాక్రామెంటో కింగ్స్‌పై 131–132తో నెగ్గిన ఇండియానా పేసర్స్‌

ముంబై: ప్రఖ్యాత నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) మొదటిసారి భారత్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ తొలి మ్యాచ్‌లో పాయింట్ల వర్షం కురిసింది. అనుక్షణం ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియానా పేసర్స్‌ 132–131తో కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో సాక్రామెంటో కింగ్స్‌పై గెలిచింది. రెండో మ్యాచ్‌ నేడు జరుగుతుంది. 12 నిమిషాల చొప్పున నిడివితో నాలుగు క్వార్టర్‌లు జరిగాయి.

తొలి క్వార్టర్‌ ముగిశాక పేసర్స్‌ 29–39తో, రెండో క్వార్టర్‌ ముగిశాక 59–72తో మూడో క్వార్టర్‌ ముగిశాక 92–97తో వెనుకంజలో ఉంది. నిర్ణాయక చివరి క్వార్టర్‌లో పేసర్స్‌ 26 పాయింట్లు స్కోరు చేయగా... కింగ్స్‌ 21 పాయింట్లు సాధించింది. దాంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 118–118తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి అదనంగా ఐదు నిమిషాలు ఆడించగా... పేసర్స్‌ 132–131తో విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు రిలయెన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ మ్యాచ్‌ బాల్‌ను నిర్వాహకులకు అందజేశారు.  

స్కోరు వివరాలు
ఇండియానా పేసర్స్‌: 132 (టీజీ వారెన్‌ 30, సబోనిస్‌ 21, జెరెమీ ల్యాంబ్‌ 20, బ్రాగ్‌డన్‌ 15, మైల్స్‌ టర్నర్‌ 11, మెక్‌డెర్మట్‌ 9); సాక్రామెంటో కింగ్స్‌: 131 (బడ్డీ హీల్డ్‌ 28, హ్యారిసన్‌ బార్నెస్‌ 21, డెరాన్‌ ఫాక్స్‌ 16, బొగ్డాన్‌ 14, నెమాంజా 14, మారి్వన్‌ బాగ్లే 12, హోమ్స్‌ 10).  

మరిన్ని వార్తలు