క్రీడా గ్రామంలో సిరంజీల కలకలం

1 Apr, 2018 00:50 IST|Sakshi

మరో 3 రోజుల్లో...

భారత ఆటగాళ్ల బస వద్ద ఘటన  

తీవ్రంగా ఖండించిన భారత అధికారి

గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రీడా గ్రామంలో సిరంజీలు బయటపడటం కలకలం రేపింది. భారత ఆటగాళ్లు బస చేసిన భవనం సమీపాన ఈ సంఘటన జరిగింది. వెంటనే ఈ విషయాన్ని సిబ్బంది తనకు తెలిపారని కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ గ్రివెమ్‌బర్గ్‌ వెల్లడించారు. అయితే... దీనిని భారత బృందంతో ఉన్న అధికారి తీవ్రంగా పరిగణించి, ఖండించారు. ‘సిరంజీలు మా ఆటగాళ్ల గదుల్లో దొరకలేదు. వివిధ దేశాల క్రీడాకారులంతా ఉన్న భవనం వద్ద లభించాయి. మేమే వాటిని సీజీఎఫ్‌ వైద్యాధికారులకు అప్పగించాం.

తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తమను ప్రశ్నించేందుకు, అనుమానించేందుకు అవకాశం లేదని చెప్పారు. కొందరు భారత ఆటగాళ్లకు డోప్‌ పరీక్షలు చేయనున్నారన్న వార్తలు రాగా... అది క్రీడలకు ముందు సహజంగా జరిగేదేనని, సిరంజీల ఉదంతంతో సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని గ్రివెమ్‌బర్గ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు