‘టోక్యో’కు విజయం దూరంలో...

12 Jun, 2019 04:00 IST|Sakshi

ప్రిక్వార్టర్స్‌లో భారత పురుషుల, మహిళల రికర్వ్‌ జట్లు

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌

డెన్‌ బాష్‌ (నెదర్లాండ్స్‌): వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే దిశగా భారత పురుషుల, మహిళల రికర్వ్‌ విభాగం జట్లు మరో అడుగు ముందుకు వేశాయి. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌ షిప్‌ టీమ్‌ విభాగంలో భారత జట్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కెనడాతో భారత పురుషుల జట్టు... బెలారస్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌లను ఖాయం చేసుకుంటాయి. మంగళవారం జరిగిన పురుషుల టీమ్‌ విభాగం తొలి రౌండ్‌లో తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, ప్రవీణ్‌ రమేశ్‌ జాదవ్‌లతో కూడిన భారత బృందం 5–1 సెట్‌ పాయింట్లతో సాండెర్, నెస్టింగ్, హాగెన్‌లతో కూడిన నార్వే జట్టును ఓడించింది.

సెట్‌ గెలిస్తే రెండు పాయింట్లు, సెట్‌లో స్కోరు టై అయితే ఒక్కోపాయింట్‌ ఇస్తారు. ఒక జట్టులోని ముగ్గురు ఆర్చర్లకు ఒక్కో సెట్‌లో రెండు బాణాల చొప్పున అవకాశం ఇస్తారు. తొలి సెట్‌లో భారత్, నార్వే 55–55తో సమంగా నిలిచాయి. దాంతో స్కోరు 1–1తో సమంగా ఉంది. రెండో సెట్‌ను భారత్‌ 59–56తో దక్కించుకొని 3–1తో ముందంజ వేసింది. మూడో సెట్‌ను భారత్‌ 57–56తో గెల్చుకొని 5–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు దీపిక కుమారి, బొంబేలా దేవి, కోమలిక బారిలతో కూడిన భారత మహిళల జట్టుకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించడంతో ఆ జట్టు నేరుగా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.   

మరిన్ని వార్తలు