వెయిట్ లిఫ్టింగ్లో సత్తాచాటిన భారత్

6 Feb, 2016 17:47 IST|Sakshi

గుహవాటి: దక్షిణాసియా క్రీడల్లో తొలిరోజే భారత వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటారు.  పురుషుల, మహిళల విభాగాల్లో రెండు స్వర్ణపతకాలు సాధించి శభాష్ అనిపించారు.  తొలుత మహిళల 48 కేజీల విభాగంలో సికోమ్ మీరాభాయ్ చాను పసిడిని దక్కించుకోగా,  అనంతరం పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా స్వర్ణాన్ని సాధించాడు. గత 2014 కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించిన సికోమ్.. దక్షిణాసియా క్రీడలు ఆరంభంలోనే మెరిసి స్వర్ణాన్ని దక్కించుకుంది. 

 

సికోమ్ మొత్తంగా 169 కేజీలు(స్నాచ్లో 79కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 90 కేజీలు) ఎత్తి ప్రథమ స్థానంలోనిలిచింది.  ఇదే విభాగంలో శ్రీలంకకు చెందిన క్రీడాకారిణి దినుషా హన్సానీ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా, బంగ్లాదేశ్ క్రీడాకారిణి మొల్లా షబిరియా మూడో స్థానం దక్కించుకుని కాంస్యంతో సరిపెట్టుకుంది.  మరోపక్క పురుషుల విభాగంలో గురురాజ్ 241 కేజీలు ( స్నాచ్ లో 104 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 137 కేజీలు) బరువును ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు.


ఇదిలా ఉండగా సైక్లింగ్ లో భారత ఆటగాళ్లు రాణించిన సంగతి తెలిసిందే. 30 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో మణిపూర్ కు చెందిన సైక్లిస్ట్ టీ విజయలక్ష్మీ బంగారు పతకాన్ని సాధించింది. తద్వారా 12వ శాఫ్ గేమ్స్ లో స్వర్ణాన్ని గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నమోదుచేసింది. 30 కిలోమీటర్ల మహిళల సైక్లింగ్ విభాగంలో 49 నిమిషాల 24 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజయలక్ష్మీ తొలి స్థానంలో నిలిచింది. మణిపూర్ కే చెందిన మరో సైక్లిస్ట్ ఛోబా దేవి శనివారం జరిగిన ఫైనల్స్ లో 49 నిమిషాల 31 సెకన్లలో టార్గెట్ చేరుకుని రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది.

మరిన్ని వార్తలు