సింధు, శ్రీకాంత్‌లకు నిరాశ

1 Jul, 2018 04:34 IST|Sakshi
పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌

సెమీస్‌లో ఓడిన భారత స్టార్స్‌

మలేసియా ఓపెన్‌ టోర్నీ

కౌలాలంపూర్‌: గతేడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు ఈ సీజన్‌లో మరోసారి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్‌ సూపర్‌ వరల్డ్‌ టూర్‌–750 టోర్నమెంట్‌లో వీరిద్దరి పోరాటం సెమీఫైనల్స్‌లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో పీవీ సింధు 15–21, 21–19, 11–21తో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో శ్రీకాంత్‌ 13–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. సింధు, శ్రీకాంత్‌లకు 9,800 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 71 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   తై జు యింగ్‌తో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సింధుకు ఈసారీ అలాంటి ఫలితమే వచ్చింది. ఈ ఇద్దరూ  హోరాహోరీగా పోరాడినా కీలకదశలో సింధు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మొమోటాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు.

మరిన్ని వార్తలు