‘టీమిండియాను కాపీ కొట్టండి’

29 Oct, 2019 10:31 IST|Sakshi

సిడ్నీ: ఇటీవల భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న ఆ దేశ కెప్టెన్‌ డుప్లెసిస్‌ వ్యంగ్యంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రతీ టెస్టులోనూ టీమిండియా మొదటి బ్యాటింగ్‌ చేయడం, మూడో రోజు చీకటి పడుతుందనగా ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేయడం చేసిందని, కాపీ-పేస్ట్‌ తరహాలో ఇదే పద్ధతిని అవలంభించిందంటూ తమ ఓటమిని సమర్దించుకునే యత్నం చేశాడు. దీనిపై  టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో డుప్లెసిస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇదిలా ఉంచితే, టీమిండియా ఆటన కాపీ కొట్టాలని అంటున్నాడు ఆసీస్‌ దిగ్గజం ఇయాన్‌ చాపెల్‌. గత కొంతకాలంగా ఆట పరంగా టీమిండియా ఎంతో పరిణితి సాధించిందని, వారి ఆటను కాపీ కొట్టడానికి యత్నించడంటూ మిగతా జట్లకు హితవు పలికాడు. మంచి ఫలితాలు సాధించాలంటే భారత క్రికెట్‌ జట్టును ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు.

క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలు అందుకొనేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని చాపెల్‌ కొనియాడాడు. క్రికెట్‌లో తమదైన ముద్ర వేయాలని తపించే దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నాడు.  తద్వారా టెస్ట్‌ క్రికెట్‌ మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి టెస్ట్‌ సి‌రీస్‌లో సౌతాఫ్రికాను 3-0తో వైట్‌వాష్‌ చేసిన టీమిండియాను చూసి మిగతా క్రికెట్‌ దేశాలు అసూయ చెందుతుంటాయన్నాడు.

‘భవిష్యత్‌లో టెస్ట్‌ క్రికెట్‌ బతికి బట్టకట్టాలంటే ఆటలో ప్రమాణాలు పెరగాలి. భారత్‌లో క్రికెట్‌ ప్రమాణాలు అమోఘంగా ఉన్నాయంటే అందుకు..ప్రతిభావంతులకు కొదవలేకపోవడం, అపార ఆర్థిక వనరులతోపాటు ఐపీఎల్‌ కూడా ఒక కారణం. అంతేకాదు అత్యున్నత శిఖరాలు చేరేందుకు భారత్‌ అనుసరిస్తున్న విధానాలను క్రికెట్‌లో బలమైన జట్టుగా మారాలని భావించే దేశాలు అనుసరించాలి’ అని చాపెల్‌ రాసిన ఒక కాలమ్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు