ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌: టికెట్లన్నీ సోల్డ్‌ ఔట్‌!

4 Jun, 2018 16:01 IST|Sakshi
భారత ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు (ఫైల్‌ ఫొటో)

ముంబై : భారత ఫుట్‌ బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదనతో చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ విన్నపంపై స్పందిస్తూ క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు మైదానాలకు వెళ్లి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు వీక్షించాలని అభిమానులను కోరారు. ఈ పిలుపుతో నేడు(సోమవారం) ముంబై ఎరీనా ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగే మ్యాచ్‌ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో భాగంగా కెన్యాతో భారత్‌ ఈ మ్యాచ్‌ ఆడనుంది.  రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌ సునీల్‌ చెత్రి కెరీర్‌లో 100 వ మ్యాచ్‌ కావడం విశేషం. సుమారు 15వేల సీటింగ్‌ కెపాసిటీ గల ఈ మైదానంలో టికెట్లన్నీ అమ్ముడయ్యాయని నిర్వాహకులు తెలిపారు.

చైనీస్‌ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ సునీల్‌ చెత్రి హ్యాట్రిక్‌ గోల్‌ సాధించడంతో భారత్‌ 5-0తో సునాయస విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు కేవలం 2500 మంది మాత్రమే హాజరుకావడంతో భారత కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్‌ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. నేటి మ్యాచ్‌ అనంతరం భారత్‌ జూన్‌ 7న న్యూజిలాండ్‌తో ఇదే మైదానంలో ఆడనుంది.

మరిన్ని వార్తలు