మహిళల జట్టూ మెరిసింది

8 Feb, 2018 01:20 IST|Sakshi
స్మృతి మంధాన,స్మృతి మంధాన

రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

సిరీస్‌ 2–0తో కైవసం... స్మృతి అద్భుత శతకం

200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జులన్‌ రికార్డు

కింబర్లీ: సఫారీ గడ్డపై భారత పురుషుల జట్టు స్పిన్నర్ల ప్రదర్శనతో స్ఫూర్తి పొందారో ఏమోగానీ... మహిళల జట్టు స్పిన్నర్లూ చెలరేగిపోయారు. దక్షిణాఫ్రికాను వరుసగా రెండో వన్డేలోనూ చిత్తుగా ఓడించిన మిథాలీ సేన మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో చేజిక్కించుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటిన భారత్‌ 178 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్మృతి మంధాన (129 బంతుల్లో 135; 14 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడైన శతకానికి తోడు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌  (69 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్‌), వేద కృష్ణమూర్తి (33 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలు చేయడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (20), పూనమ్‌ రౌత్‌ (20) ఫర్వాలేదనిపించారు.

లక్ష్య ఛేదనలో లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (4/24), ఎడంచేతి వాటం స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ (2/14)లకు తోడు దీప్తి శర్మ (2/34) ఆఫ్‌ స్పిన్‌ ధాటికి దక్షిణాఫ్రికా జట్టు చేతులెత్తేసింది. 30.5 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ లిజెల్లీ లీ (75 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కాప్‌ (17) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.  ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లౌరా వోల్‌వార్త్‌ను అవుట్‌ చేయడం ద్వారా మహిళల వన్డే క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జులన్‌ గోస్వామి రికార్డులకెక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల జులన్‌ 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 2007లో ఐసీసీ ఉమన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికైంది. పురుషుల వన్డే క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ కావడం విశేషం.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా