ధర్మశాలలోనే భారత్-పాక్ మ్యాచ్

9 Mar, 2016 00:04 IST|Sakshi
ధర్మశాలలోనే భారత్-పాక్ మ్యాచ్

 వేదిక మార్పు ఆలోచన లేదు: ఐసీసీ
 
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. పాక్‌తో మ్యాచ్‌కు సరైన భద్రత ఇవ్వలేమని హిమాచల్ ప్రదేశ్ సీఎం తేల్చిన విషయం విదితమే. ‘మ్యాచ్‌ల వేదికలను ఏడాది క్రితమే ప్రకటించాం. అయితే ధర్మశాల, ఢిల్లీ మ్యాచ్‌లపై సమస్యలున్న మాట నిజమే. మేం వాటిని పరిష్కరించే దిశగా వెళుతున్నాం. భారత ప్రభుత్వం ఇప్పటికే అన్ని జట్లకు తగిన రీతిలో భద్రత కల్పిస్తామని చెప్పింది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు. ఫిక్సింగ్ ఆరోపణలపై ఓ అంతర్జాతీయ జట్టు విచారణ ఎదుర్కొంటున్న విషయాన్ని అంగీకరిస్తూనే వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.

మరోవైపు ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మ్యాచ్‌లపై అస్పష్టత వీడింది. కీలకమైన కంప్లీషన్ సర్టిఫికెట్‌ను దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) నుంచి ఢిల్లీ క్రికెట్ సంఘం అందుకుంది. అయితే ఇది తాత్కాలిక ఆక్యుపెన్సీ సర్టిఫికెటేనని, మరో 20 రోజుల్లో స్టేడియంలోని 60 అతిక్రమణలను తొలగించాలని ఎస్‌డీఎంసీ షరతు విధించింది.

ధర్మశాలకు పాక్ బృందం
అమృత్‌సర్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు పాక్ బృం దం ధర్మశాలకు చేరుకుంది. పాక్ ఫెడరల్ పరిశోధక ఏజెన్సీ డెరైక్టర్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పీసీబీ ముఖ్య భద్రతాధికారి కల్నల్ ఆజం ఖాన్, మూడో సభ్యునిగా భారత్‌లోని పాక్ డిప్యూటీ హై కమిషనర్ ఉన్నారు. అలాగే టి20 ప్రపంచకప్‌లో పాక్ ఆడే ఒక్కో మ్యాచ్‌కు 250 మంది ఆ దేశ అభిమానులకు భారత్ వీసాలు ఇవ్వనుంది. ఈ జట్టు సెమీస్, ఫైనల్‌కు చేరితో ఈ సంఖ్యను పెంచుతారు. మరోవైపు భారత్‌లో భద్రత గురించి ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు.
 

>
మరిన్ని వార్తలు