ప్రణయ్‌ సంచలనం

15 Jun, 2017 23:57 IST|Sakshi
ప్రణయ్‌ సంచలనం

టాప్‌సీడ్‌ లీ చోంగ్‌పై నెగ్గిన భారత ప్లేయర్‌
∙ క్వార్టర్స్‌లోకి ప్రవేశం
శ్రీకాంత్‌ ఇన్‌.. సింధు, సైనాలకు షాక్‌
∙ ఇండోనేసియా ఓపెన్‌


జకర్తా: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సంచనల ఆటతీరు ప్రదర్శించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–10, 21–18తో ప్రపంచ మాజీ నం.1, టాప్‌సీడ్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ గేమ్‌లో భారత ప్లేయర్‌ ఆధిపత్యం కొనసాగింది. తొలిగేమ్‌ ఆరంభంలో 6–0తో శుభారంభం చేసిన ప్రణయ్‌.. క్రమంగా తన ఆధిపత్యాన్ని 10–3కి పెంచుకున్నాడు. అదేజోరులో ఏమాత్రం ఒత్తిడిలేకుండా ఆడుతూ ఆగేమ్‌ను తన సొంతం చేసుకున్నాడు. రెండోగేమ్‌లో తొలుత 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్‌కు కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఈ దశలో వరుసగా పాయింట్లు సాధించిన లీ చోంగ్‌.. 13–12తో ముందంజలో నిలిచాడు.

అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రమంగా పాయింట్లు సాధిస్తూ 17–14తో భారత ప్లేయర్‌ ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన లీ.. 17–17తో మ్యాచ్‌ను ఉత్కంఠదిశగా నడిపించాడు. అయితే ఈ స్థితిలో రెచ్చిపోయిన ప్రణయ్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి మ్యాచ్‌ ముంగింట నిలిచాడు. అయితే లీ పట్టుదలగా పోరాడి ఓ మ్యాచ్‌ పాయింట్‌ను కాచుకున్నాడు. అయితే ఈ దశలో దూకుడుగా ఆడిన ప్రణయ్‌ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తాజా విజయంతో లీతో ముఖాముఖిపోరును 1–2తో ప్రణయ్‌ మెరుగుపర్చుకున్నాడు.

మరో ప్రిక్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–15, 20–22, 21–16తో జాన్‌ జోర్గెన్‌సెన్‌ (డెన్మార్క్‌)పై పోరాడి విజయం సాధించాడు. 57 నిమిషాలపాటు జరిగిన ఈమ్యాచ్‌లో కీలకదశలో దూకుడుగా ఆడిన శ్రీకాంత్‌ గెలుపును కైవసం చేసుకున్నాడు. తొలిగేమ్‌లో ఇరువురు ధాటిగా ఆడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి. స్కోరు 10–10తో సమంగా ఉన్న దశలో వరుసగా పాయింట్లు సాధిం చిన శ్రీ.. 16–12తో ముందంజ వేశాడు. ఈదశలో జోర్గెన్‌సన్‌ పుంజుకుని 15–17తో పోరాడాడు. అయితే ఈదశలో భారత ప్లేయర్‌ వరుసగా నాలుగుపాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండోగేమ్‌లోనూ ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో స్కోర్లు చాలాసార్లు సమమయ్యాయి.  కీలకదశలో చెలరేగిన జోర్గెన్‌సన్‌ ఆ గేమ్‌ను నెగ్గాడు.మూడోగేమ్‌ ఆరంభంలో 0–5తో వెనుకంజలో నిలిచిన శ్రీ.. క్రమంగా పాయింట్లు సాధించి 15–12తో ముందంజ వేశాడు. ఈ దశంలో ఇదే దూకుడును కొనసాగించిన భారత ప్లేయర్‌ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ మాజీ నం.1, ఒలింపిక్‌ చాంపియన్, ఎనిమిదో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)తో ప్రణయ్, ప్రపంచ 19వ ర్యాంకర్, జు వీ వాంగ్‌ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్‌ తలపడనున్నాడు.

సైనా, సింధులు ఔట్‌
మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్, మూడుసార్లు చాంపియన్‌ సైనానెహ్వాల్‌కు షాక్‌ తగిలింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్, సైనా 15–21, 21–6, 16–21తో నిచ్చన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈమ్యాచ్‌లో కీలకదశలో తడబడిన సైనా మూల్యం చెల్లించుకుంది. తొలిగేమ్‌ ఆరంభం నుంచి వెనుకంజలో నిలిచిన సైనా.. ఆదే స్థితిలో ఆ గేమ్‌ను కోల్పోయింది. ఇక రెండోగేమ్‌లో రెచ్చిపోయిన సైనా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆగేమ్‌ను కైవసం చేసుకుంది.

నిర్ణయాత్మక మూడోగేమ్‌లో 14–12తో ఆధిక్యంలో ఉన్న సైనా.. అనంతరం తడబడి వరుసగా పాయింట్లు సమర్పించుకుంది. దీంతో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కోల్పోయింది. మరోవైపు మరో భారత నం.1 షట్లర్‌ పీవీ సింధు కూడా పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్‌ సింధు 21–15, 12–21, 18–21తో బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌ కైవసం చేసుకున్న భారత ప్లేయర్‌.. మిగతా రెండు గేమ్‌లలో తడబడి మూల్యం చెల్లించుకుంది.

మరిన్ని వార్తలు