దినేశ్‌ కార్తీక్‌కు క్షమాపణలు

19 Mar, 2018 09:00 IST|Sakshi

కొలంబో/ముంబై: నరాలు తెగిపోయేంతటి ఉత్కంఠ పోరులో భారత్‌ను విజేతగా నిలిపిన దినేశ్‌ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఇదే చర్చ.. సోషల్‌మీడియాలోనూ ట్రెండింగ్‌ నేమ్‌ డీకేదే. ‘వాట్‌ ఏ గేమ్‌.. వాట్‌ ఏ ప్లేయర్‌..’  అంటూ కామెంట్లు..! అందరిలాగే సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఓ ట్వీట్‌ వదిలారు. కానీ అందులో సంఖ్యలు తప్పుగా రాయడంతో, దినేశ్‌ కార్తీక్‌కు క్షమాపణలు చెబుతూ ఇంకో ట్వీట్‌ చేశారు.

అందుకే శంకర్‌ను ముందు పంపాం: రోహిత్‌ శర్మ
బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రకారం దినేశ్‌ కార్తిక్‌ నాలుగో డౌన్‌లో(98 పరుగుల వద్ద రోహిత్‌ ఔటైన తర్వాత) రావాల్సింది. కానీ అనూహ్యంగా శంకర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అనుభవలేమితో సతమతమౌతూ వరుసగా బంతుల్ని మింగుతూ శంకర్‌.. అభిమానుల టెన్షన్‌ను మరింత పెంచాడు. ఆ నిర్ణయంపై కెప్టెన్‌ రోహిత్‌ వివరణ ఇచ్చుకున్నాడు. ‘కీలకమైన తరుణంతో అనుభవమున్న ఆటగాడి అవసం చాలా ఉంటుంది. మ్యాచ్‌ను విజయవంతంగా ముగించగల సత్తా కార్తీక్‌కు ఉందని నేను గట్టిగా నమ్మాను. అందుకే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కి పంపాం. అనుకున్నట్లే డీకే తనదైన నైపుణ్యంతో రాణించాడు’’ అని రోహిత్‌ చెప్పాడు.

20 ఏళ్ల తర్వాత లంక గడ్డపై..
శ్రీలంక 50వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా 1998లో తొలిసారి నిదహాస్‌ ముక్కోణపు వన్డే ట్రోఫీని నిర్వహించారు. అప్పుడు శ్రీలంక-భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌లో సచిన్‌ టెండూల్కర్‌ సూపర్‌ సెచరీ(128)తో భారత్‌ 307 పరుగులు చేయగా, లంక 301 పరుగులకే ఆలౌటైంది. అలా తొలి ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత.. అంటే శ్రీలంక 70వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా రెండోసారి నిదహాస్‌ ట్రోఫీని నిర్వహించారు. వన్డేలకు బదులు టీ20లు ఆడించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 4 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపొందింది. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన దినేశ్‌ కార్తీక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ లభించగా, వాషింగ్టన్‌ సుందర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.
(చదవండి : దినేశ్‌ కార్తీక్‌ సూపర్‌ హిట్‌)

మరిన్ని వార్తలు