కశ్యప్ ఒలింపిక్ ఆశలు ఆవిరి!

5 Apr, 2016 23:48 IST|Sakshi
కశ్యప్ ఒలింపిక్ ఆశలు ఆవిరి!

గాయం కారణంగా మరో రెండు టోర్నీలకు దూరం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. మోకాలి గాయం కారణంగా ఈ నెలలో జరగనున్న మలేసియా, సింగపూర్ ఓపెన్ టోర్నీల నుంచి కశ్యప్ వైదొలిగాడు. ‘ఈ నెలలో ఇతర టోర్నమెంట్లు లేవు. వాస్తవానికి గాయం చాలా తీవ్రమైంది. మొదటిసారి గాయాన్ని గుర్తించడంలోనే పొరపాటు జరిగింది. రెండు వారాల్లో కోలుకుంటానని చెప్పారు. నేను కూడా అలానే భావించా.

కానీ అలా జరగలేదు. చాలా నిరాశగా, చిరాకుగా ఉంది’ అని కశ్యప్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ 17వ ర్యాంక్‌లో ఉన్న కశ్యప్... రియోకు అర్హత సాధించాలంటే టాప్-16లో చోటు సంపాదించాలి. అయితే మలేసియా, సింగపూర్ టోర్నీల నుంచి వైదొలగడంతో ర్యాంకింగ్‌కు అవసరమైన పాయింట్లను ఈ హైదరాబాదీ కోల్పోతున్నాడు. ప్రస్తుతం గాయం పరిస్థితిని బట్టి మరో మూడు వారాలు విశ్రాంతి తప్పదని చెప్పిన కశ్యప్... మే లేదా జూన్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశాలున్నాయన్నాడు.

మరిన్ని వార్తలు