‘కామన్వెల్త్‌’లో పాల్గొనే భారత అథ్లెట్లకు బీమా 

27 Feb, 2018 00:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు రూ. 50 లక్షల చొప్పున జీవిత బీమా చేశారు. ఎడిల్‌వీజ్‌ టోక్యో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ బీమా సదుపాయాన్ని కల్పించినట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తెలిపింది. సోమవారం ఐఓఏ భారత జట్టుకు స్పాన్సర్‌షిప్‌ చేస్తున్న సంస్థల వివరాలు వెల్లడించింది. ఎడిల్‌వీజ్‌ బీమా, ఆర్థిక సేవల కంపెనీ కామన్వెల్త్‌ గేమ్స్‌తో పాటు, ఆసియా గేమ్స్, టోక్యో ఒలింపిక్స్‌ (2020)లకూ భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతోంది.

గతంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లకు ఎడిల్‌వీజ్‌ సంస్థ రూ. కోటి బీమా చేసింది. ప్రముఖ వస్త్ర ఉత్పత్తుల సంస్థ రేమండ్స్‌ దుస్తులను స్పాన్సర్‌ చేయనుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు స్పాన్సర్‌షిప్‌ సేవలందించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు రేమండ్స్‌ చైర్మన్‌ గౌతమ్‌ హరి సింఘానియా తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చి క్రీడాకారులకు చేయూతనివ్వాలని కోరారు.   

మరిన్ని వార్తలు