మెయిన్‌ ‘డ్రా’కు గురుసాయిదత్‌

18 Jul, 2018 01:32 IST|Sakshi

సింగపూర్‌ ఓపెన్‌ టోర్నీ

సింగపూర్‌ సిటీ: ఈ ఏడాది బరిలోకి దిగిన నాలుగో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లోనూ హైదరాబాద్‌ ప్లేయర్‌ గురుసాయిదత్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం మొదలైన సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో గురుసాయిదత్‌ క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెయిన్‌ ‘డ్రా’లో బెర్త్‌ దక్కించుకున్నాడు. తొలి రౌండ్‌లో 21–7, 21–10తో రొసారియో మదోలొని (ఇటలీ)పై నెగ్గిన గురుసాయిదత్‌... రెండో రౌండ్‌లో 21–18, 21–18తో నాలుగో సీడ్‌ లియోంగ్‌ జున్‌ హావో (మలేసియా)ను ఓడించాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో కియావో బిన్‌ (చైనా)తో గురుసాయిదత్‌ ఆడతాడు. హైదరాబాద్‌కే చెందిన చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో 22–20, 10–21, 18–21తో లు చియా హంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో రితూపర్ణ దాస్‌ 13–21, 21–16, 21–12తో చౌ జెన్‌గ్రేస్‌ (సింగపూర్‌)పై గెలిచి మెయిన్‌ ‘డ్రా’ అర్హత పొందింది. 

ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌ జంట... 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జంట 21–16, 21–19తో అందిక రమదాన్‌సియా–మిచెల్లి బందాసో (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగే మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో కశ్యప్, సౌరభ్‌ వర్మ, శుభాంకర్‌ డే, వైష్ణవి రెడ్డి, రితూపర్ణ దాస్‌ బరిలోకి దిగుతారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు