ఆరోగ్య భద్రతకే ప్రాధాన్యం 

24 May, 2020 02:47 IST|Sakshi

క్రికెట్‌ పునరుద్ధరణకు మార్గదర్శకాలు విడుదల చేసిన ఐసీసీ

దుబాయ్‌: క్రికెట్‌ పునరుద్ధరణ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సభ్య దేశాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో తగిన సూచనలు పాటిస్తూ ఆటను పున రుద్ధరించాలని పేర్కొంది. తమ మార్గదర్శకాల్లో ‘ఆరోగ్య భద్రత’కే పెద్ద పీట వేసింది. వైరస్‌ వ్యాప్తికి వీలులేని వాతావరణంలో మాత్రమే క్రికెట్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని సూచించింది. శిక్షణా శిబిరాలు, మ్యాచ్‌లకు ముందు మైదానం, చేంజింగ్‌ రూమ్స్, క్రీడా పరికరాలు, బంతుల వాడకం తదితర అంశాల ద్వారా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

క్రికెట్‌ సంఘాలు ఆయా రాష్ట్రాల  ప్రభుత్వాల అనుమతి తప్పకుండా పొందాలని తెలిపింది. ఆటగాళ్లు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, సహచరులతో టవల్స్, శీతల పానీయాలు, బంతులు పంచుకోరాదని పేర్కొంది. మరోవైపు టెస్టు స్పెషలిస్టు బౌలర్లు గాయాల బారిన పడకుండా వారికి ప్రాక్టీస్‌ కోసం 2 నుంచి 3 నెలల సమయం అవసరమని చెప్పింది. ‘సాధారణంగా టెస్టు బౌలర్లకు 8–12 వారాల ప్రిపరేషన్‌ అవసరం. చివరి 5 వారాల్లో తీవ్రమైన ప్రాక్టీస్‌ చేస్తే వారు గాయాల బారిన పడరు’ అని ఐసీసీ సూచించింది.

మరిన్ని వార్తలు