ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం 

29 Mar, 2020 05:00 IST|Sakshi

‘టోక్యో’ బెర్త్‌లపై ఐఓసీ స్పష్టత

టోక్యో: కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఒలింపిక్స్‌ బెర్త్‌లపై ఆటగాళ్లలో నెలకొన్న సందేహాలపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధికారులు స్పష్టత ఇచ్చారు. అర్హత టోర్నీల ద్వారా ఇప్పటికే ఒలింపిక్స్‌ బెర్త్‌లు సాధించిన 6,200 మంది అథ్లెట్ల స్థానానికి ఢోకా లేదని తెలిపారు. వారు వచ్చే ఏడాది జరుగనున్న ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొంటారని స్పష్టం చేశారు. ఐఓసీ నిర్ణయంపై అన్ని అంతర్జాతీయ క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రపంచ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ఇప్పటికే టోక్యోకు అర్హత సాధించిన అథ్లెట్లను నేరుగా వచ్చే ఏడాది గేమ్స్‌లో అనుమతించడం హర్షించదగిన అంశం. ఇంకా మిగిలి ఉన్న స్థానాల కోసం సరైన పద్ధతిని అనుసరించి అర్హత టోర్నీలు నిర్వహించాలి’ అని ఆయన అన్నారు. కరోనా కారణంగా ఆటలన్నీ రద్దు కాకముందే మారథాన్, స్విమ్మింగ్, ఇతర క్రీడా ఈవెంట్‌లలో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలు జరుగగా వందలాది మంది అథ్లెట్లు టోక్యో బెర్త్‌లు కైవసం చేసుకున్నారు. అనూహ్యంగా విశ్వక్రీడలు వాయిదా పడటంతో వారి కోటాలపై ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు సగం బెర్త్‌లే ఖరారు కాగా...  మిగిలిన స్థానాలను ఎలా భర్తీ చేస్తారనే అంశాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు