ఆ పాక్‌ దిగ్గజం అండగా నిలిచాడు: రషీద్‌

2 May, 2020 14:04 IST|Sakshi

హార్దిక్‌ చాలా ప్రమాదకరం

పొట్టి ఫార్మాట్‌లో విండీస్‌ క్రికెటర్లే మేటి

ఇంటిలో ఐదు ఓవర్ల క్రికెట్‌ ఆడుతున్నా

కాబూల్‌:  తమ జట్టుకు పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు ఇంజమాముల్‌ హక్‌ కోచ్‌గా పని చేసిన సమయంలో తనకు ఎక్కువ అండగా నిలిచాడని అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తెలిపాడు. తనను బాగా గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇంజమాములేనని రషీద్‌ పేర్కొన్నాడు. తనను కేవలం టీ20 బౌలర్‌గా మాత్రమే ముద్ర వేసిన సమయంలో ఇంజీ తనపై నమ్మకం ఉంచాడన్నాడు.  తనను టీ20 స్పెషలిస్టుగా ముద్ర వేయడంతో అసంతృప్తి ఉండేదని, ఇదే విషయాన్ని ఇంజీతో చెబితే వాటిని పట్టించుకోవద్దన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టులో కచ్చితంగా ఉంటావనే హామి ఇచ్చాడన్నాడు .అలా తన కెరీర్‌ ఎదుగుదలకు ఇంజీ సహకరించాడన్నాడు. టీ20 స్పెషలిస్టు ముద్రపై ఇంజీ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు. తాను అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతానని నమ్మకం ఇంజీలో ఉండేదని, అదే ఈరోజు తనను నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌గా నిలబెట్టిందన్నాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో మేటి జట్టు ఏదైనా ఉందంటే అది వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టేనని రషీద్‌ స్పష్టం చేశాడు. (గంగూలీ చెప్పినట్లే చేశా: పంత్‌)

అచ్చం టీ20లకు సరిపోయే బ్యాట్స్‌మెన్‌ విండీస్‌ జట్టులో చాలా మంది ఉన్నారన్న రషీద్‌.. టీమిండియా క్రికెట్‌లో హార్దిక్‌ పాండ్యా చాలా ప్రమాదకరమన్నాడు. టీ20ల్లో హార్దిక్‌ జోరును ఆపడం చాలా కష్టమన్నాడు. తన తల్లి క్రికెట్‌కు పెద్ద అభిమాని అని రషీద్‌ తెలిపాడు. తాను క్రికెట్‌ ఆడుతున్న నాటి నుంచి అమ్మ ఈ గేమ్‌కు ఫ్యాన్‌గా మారిపోయారన్నాడు. ప్రస్తుతం క్రికెట్‌ ఈవెంట్‌లు ఏమీ జరగకపోవడంతో అ‍మ్మ విపరీతమైన బోర్‌ ఫీలవుతున్నట్లు పేర్కొన్నాడు. ఇంటిని క్రికెట్‌ స్టేడియంగా మార్చేసి ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలిపాడు. తన ఇంటిలో లెగ్‌ స్పిన్‌ వేయడానికి సరిపోయే స్థలం ఉందన్నాడు. ఇంటిలో ఐదు ఓవర్ల క్రికెట్‌ ఆడుతున్న విషయాన్ని రషీద్‌ తెలిపాడు. తన సోదరుల్లో కొంతమంది లాక్‌డౌన్‌ కారణంగా వారి వారి ఇళ్లలోనే చిక్కుకుపోగా, మిగిలి వారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నానన్నాడు. తమ ఇంట్లో ఉన్న సోదరులు,  ఇతర బంధువులతో కలిసి రెండు జట్లుగా విడిపోయి క్రికెట్‌ గేమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నామన్నాడు. ఇలా ఆడటం వల్ల తన బాల్యం బాగా గుర్తుకువస్తుందన్నాడు. 2015 అక్టోబర్‌లో అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌గా ఎంపికైన ఇంజీ.. ఎనిమిది నెలలు పాటు ఆ జట్టు కోచ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. (ఆసీస్‌ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!)

మరిన్ని వార్తలు