కొత్త పాత్రలో ఇంజమామ్ ఉల్ హక్

2 Oct, 2015 23:56 IST|Sakshi
కొత్త పాత్రలో ఇంజమామ్ ఉల్ హక్

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారధి, లెజెండరీ బ్యాట్స్మన్ ఇంజమామ్ ఉల్ హక్ ఇకపై సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు నూతన కోచ్ గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే కేవలం 25 రోజులు మాత్రమే హక్ ఈ పదవిలో కొనసాగుతారని తెలిసింది.

ఆఫ్ఘన్ జట్టు ఈ నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. 16 ప్రారంభం కానున్న పర్యటనలో ఇరు దేశాలు ఐదు వన్ డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనున్నాయి. కేవలం జింబాబ్వే సిరీస్ కు మాత్రమే ఇంజమామ్ ను కోచ్ గా తీసుకుంటున్నట్లు ఏసీబీ తెలిపింది. హక్ కూడా అందుకు అంగీకరించినట్లు పేర్కొంది. కాగా, ప్రస్తుత కోచ్ తో భాషాపరమైన ఇబ్బందులు తలెత్తడం వల్లే మార్పు అనివార్యమయినట్లు తెలిసింది.

గత ఆగస్లులో ఆఫ్ఘన్ కోచ్ గా ఆండీ మోల్స్ (ఇంగ్లాండ్) నియమితులయ్యారు. ఆ జట్టుకు మొట్టమొదటి ఆంగ్లేయ కోచ్ ఆయన. ఆఫ్ఘన్ ఆటగాళ్లలో చాలామందికి స్థానిక, ఉర్దూ తప్ప మిగతా భాషలు అంతగా తెలియకపోవటం వల్ల ఆండీ మోల్స్ తో కనెక్ట్ కాలేకపోయారట! అందుకే ఇంజమామ్ నియమకానికి మొగ్గుచూపింది ఏసీబీ. ప్రస్తుతానికి కొద్దిరోజులే అయినా జింబాబ్వే సిరీస్ తర్వాత హక్ ను కొనసాగించే అవకాశాలు లేకపోలేవు. గతంలో పాకిస్థాన్ కే చెందిన కబీర్ ఖాన్, రషీద్ లతిఫ్ లు ఆఫ్ఘనిస్థాన్ కోచ్ లుగా పనిచేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా