కోహ్లికి సూచనలివ్వడానికి మీరెవరు ?

3 Mar, 2020 13:12 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఘోరంగా విఫలం కావడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజామామ్‌-ఉల్‌-హక్‌ మాత్రం మద్దతుగా నిలిచాడు. కోహ్లి ఆటతీరును తప్పుబడుతూ క్రిటిక్స్‌ చేసిన విమర్శలకు యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా దీటుగా బదులిచ్చాడు. ' కోహ్లి ఆటతీరు, అతని టెక్నిక్‌పై పెదవి విరుస్తున్న వాళ్లకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు సాధించిన విరాట్‌ కోహ్లి టెక్నిక్‌పై విమర్శలు చేసే హక్కు మీకెవరికి లేదు. ప్రతి క్రికెటర్‌ ఏదో ఒక దశలో బ్యాడ్‌ఫేజ్‌లో ఉండడం సహజమే, దీనికే మీరంతా కోహ్లి ఆటను తప్పు బట్టడం సరికాదు. అయినా ఒక క్రికెటర్‌ తన కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన చేసినా ఒక్కోసారి విఫలమవుతూనే ఉంటారు. ఒకప్పుడు మా జట్టు ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌ ఇలాగే తన పూర్‌ ఫామ్‌ను కొనసాగించినప్పుడు అతని టెక్నిక్‌పై కూడా ఇలాగే విమర్శలు సంధించారు. అప్పుడు నేను యూసఫ్‌కు ఒకటే చెప్పా.. నీకు టెక్నిక్‌ అనేది లేకపోయుంటే ఇన్ని పరుగులు ఎలా సాధించేవాడివా అని ప్రశ్నించాను. (జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం)

అయినా కివీస్‌ పర్యటనలో భారత్‌ విఫలమైందంటే అది కోహ్లి ఒక్కడివల్ల మాత్రం కాదు. కోహ్లి పరుగులు సాధించలేదు నిజమే మరి జట్టులో మిగతావారు కూడా విఫలమయ్యారు.. దాని గురించి మాత్రం ఎవరు ఎందుకని మాట్లాడడం లేదు. కోహ్లి ప్రదర్శనపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతని టెక్నిక్‌పై కూడా విమర్శలు అవసరం లేదు. ఈ పర్యటనలో విఫలమైనా తిరిగి ఫుంజుకునే సత్తా కోహ్లిలో ఉందని నేను బలంగా నమ్ముతున్నా. నా దృష్టిలో సయీద్‌ అన్వర్‌, సౌరవ్‌ గంగూలీ లాంటి ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు ఆకట్టుకున్నారు.. అయితే విఫలమైన ప్రతీసారి తిరిగి బౌన్స్‌బ్యాక్‌ అయ్యారు.. ఇప్పుడు కోహ్లి కూడా అలాగే మెరుగైన ప్రదర్శన ఇస్తాడని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కివీస్‌ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మొత్తం మూడు ఫార్మాట్లు కలిపి 11 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 218 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. కాగా కివీస్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా, వన్డేలతో పాటు టెస్టు సిరీస్‌ను ఆతిథ్య జట్టు క్లీన్‌స్వీప్‌ చేయడం గమనార్హం. 
(ఆ ముగ్గురు క్రికెట్‌ గతిని మార్చారు : ఇంజమామ్‌)

(మైకేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు