సరే... అలాగే చేద్దాం

29 Jul, 2019 01:43 IST|Sakshi

ఐఓఏ బాయ్‌కాట్‌ ప్రతిపాదనకు ఎన్‌ఆర్‌ఏఐ మద్దతు  

న్యూఢిల్లీ : బర్మింగ్‌హామ్‌ ఆతిథ్యమివ్వనున్న 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బాయ్‌కాట్‌ చేయాలనుకుంటున్న భారత ఒలింపిక్‌ సంఘానికి (ఐఓఏ) మద్దతు పెరుగుతోంది. ఐఓఏ నిర్ణయాన్ని భారత రైఫిల్‌ షూటింగ్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) సమర్థించింది. భారత్‌కు పతకాలు తెచ్చిపెడుతున్న షూటింగ్‌ క్రీడను ఆ గేమ్స్‌  నుంచి తొలగించడంతో ఐఓఏ తీవ్ర అసంతృప్తితో ఉంది. శనివారం బాయ్‌కాట్‌ ప్రతిపాదనన తెరపైకి తెచ్చిన ఐఓఏ భారత ప్రభుత్వం అనుమతి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుకు లేఖ రాశారు. దీన్ని ఎన్‌ఆర్‌ఏఐ స్వాగతించింది. ఈ సంఘం కార్యదర్శి రాజీవ్‌ భాటియా మాట్లాడుతూ ‘మేం ఐఓఏ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. ఐఓఏ అధ్యక్షుడు సమర్థంగా పనిచేస్తున్నారు. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌పై వారు ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది’ అని అన్నారు. సెప్టెంబర్‌లో రువాండాలో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) జనరల్‌ అసెంబ్లీకి కూడా గైర్హాజరు కావాలని ఐఓఏ నిర్ణయించింది.  

భారత్‌ పాల్గొనాలి: సీజీఎఫ్‌ 
మరోవైపు సీజీఎఫ్‌ భారత ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఐఓఏ నిర్ణయంపై సీజీఎఫ్‌ స్పందన కోరగా... ‘బర్మింగ్‌హామ్‌ మెగా ఈవెంట్‌లో భారత్‌లాంటి దేశం గైర్హాజరు కావడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదు. భారత బృందం పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. భారత్‌ అభ్యంతరాలు, అసంతృప్తులపై చర్చించేందుకు మా అధికారుల బృందం త్వరలో భారత్‌ వెళుతుంది. ఐఓఏను ఒప్పిస్తుంది’ అని సీజీఎఫ్‌ మీడియా, కమ్యూనికేషన్స్‌ మేనేజర్‌ టామ్‌ డెగున్‌ ఈ–మెయిల్‌ ద్వారా వివరణ ఇచ్చారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా