ఐఓఏ ఏకపక్ష నిర్ణయం తీసుకోదు

26 Jun, 2019 04:43 IST|Sakshi

కేంద్రాన్ని సంప్రదించాలి

కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలగడంపై కేంద్ర క్రీడల మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ (2022) నుంచి భారత్‌ వైదొలగే నిర్ణయాన్ని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఏకపక్షంగా తీసుకోజాలదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. భారత్‌కు పతకాలు తెచ్చే షూటింగ్‌ క్రీడను ఈ గేమ్స్‌ నుంచి తప్పించాలని ఆతిథ్య దేశం నిర్ణయించింది. దీంతో ఐఓఏ తీవ్రంగా స్పందించింది. అదేగనక ఇంగ్లండ్‌ తుది నిర్ణయమైతే ఆ టోర్నీలో పాల్గొనకుండా బాయ్‌కాట్‌ చేసే ఆలోచన ఉందని ఐఓఏ ఇటీవల ప్రకటించింది.

దీనిపై క్రీడల మంత్రి రిజిజు స్పందిస్తూ ‘ప్రస్తుత పరిణామాలపై నాకేమీ తెలియదు. షూటింగ్‌ సమాఖ్య (ఎన్‌ఆర్‌ఏఐ)తో పాటు, ఐఓఏతో చర్చిస్తాను. బాయ్‌కాట్‌ చేయాలనుకుంటే ముందుగా ప్రభుత్వ నిర్ణయమేంటో తెలుసుకోవాలి. దేశ ప్రతిష్టకు, ఆటగాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి కీలకమైన నిర్ణయాల్ని ఏ ఒక్కరు ఏకపక్షంగా తీసుకోవడానికి వీల్లేదు’ అని అన్నారు. 2032 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం ఐఓఏ గతేడాది ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ను సమర్పించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లకు ఆతిథ్యమివ్వాలని ప్రతి దేశానికి ఉంటుందని... అయితే అందుకు అత్యున్నత సదుపాయాలు, సన్నద్ధత, సామర్థ్యంపై బేరీజు వేసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.  

మహిళల హాకీ జట్టుకు అభినందనలు...
ఎఫ్‌ఐహెచ్‌ మహిళల సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ గెలిచిన భారత జట్టును అభినందించిన క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ కోసం అన్ని విధాల అండదండలు అందజేస్తామని చెప్పారు. జట్లకు, క్రీడాకారులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ ఏడాది మహిళల జట్టు ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌లో తలపడనుంది. ఒకటికి మించి సమాఖ్యలు పుట్టుకొచ్చిన క్రీడా సమాఖ్యలు భారత క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ), జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య (జీఎఫ్‌ఐ)ల తీరుపై ప్రేక్షకపాత్ర వహించబోమని చెప్పారు. 

మరిన్ని వార్తలు