‘గేమ్స్‌ను జరిపి తీరుతాం’ 

18 Mar, 2020 01:39 IST|Sakshi

ఐఓసీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం

టోక్యో: కొవిడ్‌–19 విలయతాండవం చేస్తున్నప్పటికీ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను నిర్వహించడమే లక్ష్యంగా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. టోక్యో ఈవెంట్‌కు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి అనుచిత, అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ అభిప్రాయపడింది. ఈ అత్యున్నత సమావేశంలో ఐఓసీ స్టేక్‌ హోల్డర్లు, అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ, వివిధ దేశాలకు చెందిన జాతీయ ఒలింపిక్‌ కమిటీ, క్రీడాసమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.

అయితే అందరి సంరక్షణకే తమ తొలి ప్రాధాన్యమని, ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఆటలు సాగుతాయని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే కార్యాచరణ కొనసాగిస్తామని చెప్పారు. ప్రత్యేక సమావేశంలో అసంపూర్తిగా ఉన్న క్వాలిఫికేషన్‌ ప్రక్రియను ఎలా పూర్తిచేయాలన్న దానిపై చర్చించారు. ఇప్పటివరకైతే 57 శాతం మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇంకా 43 శాతం మంది అర్హత సాధించాల్సివుంది. ప్రధానంగా దీనిపైనే ఐఓసీ సమావేశంలో చర్చించారు. సమావేశంలోని ప్రతిపాదనల్ని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌తో పాటు పాల్గొన్న ప్రతి అంతర్జాతీయ క్రీడా సమాఖ్య ఏకగ్రీవంగా ఆమోదించింది. 

చర్చలోని ప్రధానాంశాలు  
►ఇప్పటివరకు ఖరారైన కోటా స్థానాల్ని సంబంధిత అథ్లెట్లకు, సమాఖ్యలకు కేటాయించారు. దీనిపై ఏ సమస్యా లేదు.  
►ఇక మిగిలిన క్వాలిఫికేషన్‌ ఈవెంట్లను  పూర్తి చేసేందుకు అవలంభించాల్సిన పద్ధతుల్ని, సాధ్యాసాధ్యాల్ని సంబంధిత క్రీడా సమాఖ్యలతో పరిశీలిస్తారు. 
►ఆన్‌ ఫీల్డ్‌ ఫలితాలు లేదంటే ర్యాంకింగ్, గడిచిన అత్యుత్తమ ఫలితాల ఆధారంగా బెర్తులిచ్చే అంశాల్ని పరిశీలించనున్నారు. 
►ఈ పద్ధతుల్లో అథ్లెట్ల కోటా పెరిగితే ప్రతి కేసును, ఆయా పరిస్థితుల్ని కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

కరోనా హైరానా... 
‘జ్యోతి’ దారి కుదింపు

టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు టార్చ్‌ రిలే (ఒలింపిక్‌ జ్యోతి) చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రపంచ దిగ్గజాలు చేతబూనే ఈ జ్యోతి ఎక్కడికెళ్లినా విశేష ఆదరణ లభిస్తుంది. అలాంటి రిలేకు కరోనా పెద్ద కష్టమే తెచ్చింది. అసాంతం, అద్వితీయంగా సాగే రీలే ఇప్పుడు మాత్రం కుదించిన రూట్లలో అది కూడా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యే వారితో ముగించాలని టోక్యో–2020 ఆర్గనైజింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జన సమూహానికి అవకాశమివ్వరాదని, ఎవరూ కూడా గుమిగూడి చూడాల్సిన అవసరం లేదని దానివల్ల కరోనా ముప్పు పొంచి వుందని నిర్వాహకులు హెచ్చరికలు జారీచేశారు.  
►జపాన్‌ ఒలింపిక్‌ కమిటీ డిప్యూటీ చీఫ్‌కు వైరస్‌ 
టోక్యో: ఓ వైపు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఏమో గేమ్స్‌ను జరిపి తీరాల్సిందేననే పట్టుదలతో ఉంటే... మరోవైపు నిర్వాహక దేశానికి చెందిన కమిటీ డిప్యూటీ చీఫ్‌ కొజో తషిమా కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కోవిడ్‌–19 పరీక్షల ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయని ఆయన వాపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
►ఫుట్‌బాల్‌ యువ కోచ్‌ మృతి 
మాడ్రిడ్‌: కరోనా వైరస్‌ స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల యువ ఫుట్‌బాల్‌ కోచ్‌ను బలి తీసుకుంది. ఫ్రాన్సిస్కా గార్సియా కొవిడ్‌–19తో మృతి చెందినట్లు స్పానిష్‌ లీగ్‌ వర్గాలు తెలిపాయి. 
►అన్ని శిబిరాలు వాయిదా: రిజిజు 
భారత్‌లోనూ కరోనా వైరస్‌ చాపకింద నీరులా విజృంభిస్తుండటంతో దేశంలో అన్ని రకాల శిక్షణ శిబిరాలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఒలింపిక్స్‌ సన్నాహక శిబిరాలు మాత్రమే యథాతథంగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. 
►భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టర్కీలో తన శిక్షణను అర్ధాంతరంగా ముగించుకొని తిరుగుముఖం పట్టాడు. టోక్యో ఈవెంట్‌కు అర్హత సంపాదించిన ఇతను గత నెల రోజులుగా టర్కీలో శిక్షణ పొందుతున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు