క్రీడాకారులకు ఐఓసీఎల్‌ సత్కారం

8 Jun, 2018 09:49 IST|Sakshi

వాలీబాల్, కబడ్డీ క్రీడలకూ స్పాన్సర్‌షిప్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) సంస్థ గురువారం తమ సంస్థకు చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించింది. పలు టోర్నీల్లో ఐఓసీఎల్‌ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 60 మంది భారత క్రీడాకారులను సన్మానించింది. ఈ కార్యక్రమంలో మేటి క్రీడాకారులైన మనికా బాత్రా, ఆచంట శరత్‌ కమల్‌ (టేబుల్‌ టెన్నిస్‌), రోహన్‌ బోపన్న (టెన్నిస్‌), పారుపల్లి కశ్యప్, ఎన్‌. సిక్కిరెడ్డి (బ్యాడ్మింటన్‌), ఆదిత్య తారే (క్రికెట్‌), ద్రోణవల్లి హారిక (చెస్‌) తదితరులు పాల్గొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో క్రీడాకారుల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఐఓసీఎల్‌... ఈ సందర్భంగా కొత్త నిర్ణయాలను ప్రకటించింది. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంపొందించేలా నూతన క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నామని ఐఓసీఎల్‌ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ కె. రంజన్‌ మొహపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఐఓసీఎల్‌ 10 క్రీడలకు స్పాన్సర్‌షిప్‌ అందజేస్తుంది. వీటితో పాటు కొత్తగా వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, రెజ్లింగ్, కబడ్డీ క్రీడల్ని ఈ జాబితాలో చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రంజన్‌ తెలిపారు. వర్ధమాన ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు కల్పిస్తూ, వారి ప్రతిభకు గుర్తింపుగా చిరు సత్కారాలతో గౌరవించడం వల్ల ఆటగాళ్లలో ప్రేరణ కలిగించవచ్చు అని ఆయన అన్నారు. ఈ ప్రేరణతో వారు దేశానికి, సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వారు కీర్తి ప్రతిష్టలు తెస్తారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐఓసీఎల్‌ తరఫున కోచింగ్, స్పోర్ట్స్‌ కిట్లను అందజేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు