ఎన్నాళ్లకెన్నాళ్లకు...

25 Apr, 2015 01:01 IST|Sakshi
ఎన్నాళ్లకెన్నాళ్లకు...

రాజస్తాన్‌పై బెంగళూరు గెలుపు    
 రాణించిన కోహ్లి, డివిలియర్స్    
 స్టార్క్ మెరుపు బౌలింగ్

 
 ఇన్నాళ్లూ బెంగళూరుకు అతి పెద్ద బలహీనతగా మారిన బౌలర్లు ఎట్టకేలకు గాడిలో పడ్డారు. గత మ్యాచ్‌ల ప్రదర్శనతో ఏమాత్రం సంబంధం లేకుండా చెలరేగిపోయారు. దీంతో  మంచి ఊపుమీదున్న రాజస్తాన్‌ను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో కోహ్లి, డివిలియర్స్‌లు కూడా తమ సత్తా చూపడంతో స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించింది.
 
 అహ్మదాబాద్: జట్టులో భారీ హిట్టర్లున్నా... బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందులు పడుతున్న బెంగళూరుకు ఐపీఎల్‌లో కాస్త ఊరట లభించింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమయోచితంగా ఆడటంతో మూడు వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్ కోహ్లి (46 బంతుల్లో 62 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), డివిలియర్స్ (34 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు)ల వీరోచిత బ్యాటింగ్‌తో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు మరో 23 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లతో ఛేదించింది.
 
 సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. రహానే (12 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), వాట్సన్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (28 బంతుల్లో 31; 2 ఫోర్లు), బిన్నీ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు), కరణ్ నాయర్ (14 బంతుల్లో 16; 1 సిక్స్) తలా కొన్ని పరుగులు జత చేశారు. ఆరంభం నుంచి బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగడంతో రాజస్తాన్ రన్‌రేట్ నెమ్మదిగా సాగింది.
 
 రహనే, వాట్సన్ తొలి వికెట్‌కు 36 పరుగులు జోడిస్తే... మధ్యలో స్మిత్, బిన్నీ ఆరో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన స్టార్క్ (3/22)... ఇన్నింగ్స్ చివర్లో ఏడు బంతుల తేడాలో స్మిత్, బిన్నీ, ధవల్ కులకర్ణి (1)లను అవుట్ చేసి రాజస్తాన్ స్కోరును కట్టడి చేశాడు. భారీ హిట్టర్లు ఫాల్క్‌నర్ (4), దీపక్ హుడా (1)లు మరోసారి విఫలమయ్యారు.
 
 తర్వాత బెంగళూరు 16.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసి నెగ్గింది. ఉన్నంతసేపు భారీ షాట్లతో అలరించిన గేల్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరి స్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన డివిలియర్స్... కోహ్లికి చక్కని సహకారం అందించాడు. ఈ ఇద్దరు బౌండరీలతో పాటు వీలైనప్పుడల్లా భారీ సిక్సర్లతో రన్‌రేట్ తగ్గకుండా చూశారు.
 
 ఈ క్రమంలో విరాట్ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రాజస్తాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఈ జోడి రెండో వికెట్‌కు అజేయంగా 11.4 ఓవర్లలో 98 పరుగులు జతచేసి జట్టును గెలిపించింది. వాట్సన్‌కు ఒక్క వికెట్ దక్కింది. స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
 స్కోరు వివరాలు
 రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే ఎల్బీడబ్ల్యు (బి) పటేల్ 18; వాట్సన్ (సి) స్టార్క్ (బి) చాహల్ 26; స్మిత్ (సి) కార్తీక్ (బి) స్టార్క్ 31; నాయర్ రనౌట్ 16; దీపక్ హుడా (బి) అబ్దుల్లా 1; శామ్సన్ (బి) చాహల్ 4; బిన్నీ (సి) వీస్ (బి) స్టార్క్ 20; ఫాల్క్‌నర్ (సి) కార్తీక్ (బి) పటేల్ 4; మోరిస్ నాటౌట్ 3; ధవల్ కులకర్ణి (బి) స్టార్క్ 1; తాంబే నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1-36; 2-46; 3-72; 4-84; 5-89; 6-119; 7-121; 8-126; 9-127. బౌలింగ్: స్టార్క్ 4-0-22-3; ఇక్బాల్ అబ్దుల్లా 4-0-28-1; హర్షల్ పటేల్ 4-0-23-2; చాహల్ 3.1-0-25-2; వీస్ 4-0-27-0; కోహ్లి 0.5-0-4-0. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 20; విరాట్ కోహ్లి నాటౌట్ 62; ఏబీ డివిలియర్స్ నాటౌట్ 47; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (16.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 134. వికెట్ల పతనం: 1-36. బౌలింగ్: మోరిస్ 3-0-23-0; ధవల్ 4-0-26-0; వాట్సన్ 3-0-23-1; ఫాల్క్‌నర్ 2-0-17-0; తాంబే 4-0-36-0; హుడా 0.1-0-4-0.


ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు
 ముంబై ఇండియన్స్
             x
 సన్‌రైజర్స్ హైదరాబాద్
 వేదిక: ముంబై; సా. గం. 4.00 నుంచి
 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 చెన్నై సూపర్ కింగ్స్
             x
 పంజాబ్ కింగ్స్ ఎలెవన్
 వేదిక: చెన్నై; రాత్రి  గం. 8.00 నుంచి
 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

మరిన్ని వార్తలు