మాయ చేసిన లెగ్‌ స్పిన్నర్‌

8 Apr, 2018 11:17 IST|Sakshi

సాక్షి, ముంబై : ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ తాను మాత్రం కల అనుకున్నాడు. స్నేహితులు చెబితే అబద్ధంతో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాడు. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో బ్రావో మెరుపులతో ఈ ఆటగాడి ప్రదర్శన కనబడలేదు. కానీ భవిష్యత్‌లో భారత జట్టుకు ఓ లెగ్‌ స్పిన్నర్‌ దొరికినట్లే. టీ20 ఆడిన అనుభవం ఏమాత్రం లేకున్నా తన అరంగేట్రంలోనే అందరినీ ఆకట్లుకున్నాడు. కీలక సమయంలో రాయుడు, ధోని, చహర్‌ వికెట్లు తీసి అందరిని తనవైపు తిప్పుకున్నాడు. అతడే.. మయాంక్‌ మార్కండే. 

ముంబై కోచ్‌ ప్రశంసలు
తొలి మ్యాచ్‌లోనే బంతిని గింగిరాలు తిప్పుతూ మూడు వికెట్లు పడగొట్టిన మార్కండేపై ముంబై ఇండియాన్స్‌ ప్రధాన కోచ్‌ జయవర్దనే ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ లెగ్‌ స్పిన్నర్‌ను ఎంపిక చేసిన వెంటనే అతనికి ట్రయల్స్‌ నిర్వహించి సాన పెట్టామని, ఇలానే కష్టపడితే భవిష్యత్తులో గొప్ప లెగ్‌ స్పిన్నర్‌ అవుతాడని ముంబై కోచ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

షేన్‌ వార్న్‌ ఆదర్శం
ఫాస్ట్‌ బౌలర్‌ అవుదామని క్రికెట్‌ మొదలెట్టిన మార్కండే.. కోచ్‌ సలహా మేరకు స్పిన్‌ బౌలింగ్‌పై దృష్టి సారించి అద్భుత ప్రతిభ కనబరిచాడు. పంజాబ్‌ తరుపున పలు  మ్యాచ్‌ల్లో మెరిసాడు. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ను ఆదర్శంగా తీసుకొని కష్టపడి ఫలితం రాబడుతున్నాడు. అయితే భారత సెలక్షన్‌ కమిటీ దృష్టి పెట్టి ఉంటే రషీద్‌ ఖాన్‌, షాదాబ్‌ ఖాన్‌లాగే మార్కండేకు కూడా ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చేది అని విశ్లేషకుల అభిప్రాయం. ముంబై ఇండియన్స్‌ ప్రాంఛైజీ ఈ ఆటగాడి దేశవాళి ప్రదర్శన నచ్చి ఐపీఎల్‌ వేలంలో కనీస ధరకే చేజిక్కించుకుంది. ఇక ఇప్పటికే మార్కండేపై అంచనాలు పెరగటంతో ఈ పంజాబీ ప్లేయర్‌ మిగతా మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు