ఐపీఎల్‌-12లో జ్యోతిష్యమే గెలిచింది..

13 May, 2019 19:16 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12 ఫైనల్‌ పోరులో జ్యోతిష్యమే గెలిచింది. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు విజేతగా ముంబై ఇండియన్స్‌ నిలుస్తుందని పలువురు జ్యోతిష్కులు వెల్లడించారు. రోహిత్‌ శర్మకు, ముంబై ఇండియన్స్‌ జట్టుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతాలు సాధిస్తాడని, ధోనీకి అనుకూలంగా ఉన్న గ్రహాలు, అదృష్టం ఈసారి రోహిత్‌కు అనుకూలమయ్యాయని వారు వివరించారు. అయితే జో​తిష్యుల అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీని నాలుగో సారి ముద్దాడింది. దీంతో తమ జ్యోతిష్యమే గెలిచిందని పలువురు సిద్దాంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఆదివారం స్థానక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్‌ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. అయితే  గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం తప్పకుండా ఉండాలంటారు. నిన్నటి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ అదృష్టం రోహిత్‌కు ఉన్న గ్రహబలమేనని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. 


బల్కంపేట అమ్మవారి ఆలయంలో నీతా అంబానీ పూజలు

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి, ముంబై ఇండియన్స్‌ జట్టు యజమాని నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమె మ్యాచ్‌ మధ్యలో బల్కంపేటలోని అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడి ఆవరణలోని పోచమ్మ, నాగదేవత ఆలయాలను కూడా ఆమె సందర్శించారు. 

అనంతరం నీతా అంబానీ తిరిగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్కంఠంగా సాగుతున్న మ్యాచ్ ఆసాంతం ఆమె పూజలు చేశారు. చివరి బంతి సమయంలో కూడా మంత్రాలు చదువుతూ కనిపించారు. ఆమె మొక్కులు ఫలించే ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిందని సోషల్‌మీడియాలో ముంబై ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నీతా అంబానీ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు.

చదవండి: విజేత ఎవరో చెప్పిన జ్యోతిష్కుడు 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు