ఎన్నిమిదోస్సారి

10 May, 2019 23:22 IST|Sakshi

ఐపీఎల్‌ తుది పోరుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌

మళ్లీ ఫైనల్‌ చేరిన ధోని బృందం

క్వాలిఫయర్‌–2లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్లతో విజయం

ఆదివారం హైదరాబాద్‌లో ముంబైతో చెన్నై ఫైనల్‌ పోరు  

అనుభవం ముందు యువతరం తలవంచింది. సీనియర్‌ నాయకుడి వ్యూహాలకు  కుర్ర కెప్టెన్‌ ప్రణాళికలు సరిపోలేదు. ధోని నేతృత్వంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌లో మళ్లీ తన ముద్రను చూపించింది. ఏకంగా ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరి తమ సత్తా ఏమిటో ప్రదర్శించింది. ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌ దశకు చేరి ఎలిమినేటర్‌లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రదర్శన మూడో స్థానానికే పరిమితమైంది. ముందుగా చెన్నై స్పిన్‌ త్రయం దెబ్బకు 147 పరుగులే చేసి విజయావకాశాలు తగ్గించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ బృందం తర్వాత సాధారణ బౌలింగ్‌ ప్రదర్శనతో, చెత్త ఫీల్డింగ్‌తో చెన్నైని నిలువరించలేకపోయింది. వెటరన్లు వాట్సన్, డు ప్లెసిస్‌ అర్ధ సెంచరీలకు యువ ఢిల్లీ ఆట ముగిసింది. ఇక నాలుగోసారి ఫైనల్లో తలపడనున్న చెన్నై, ముంబై మధ్య విజేత ఎవరో ఆదివారం హైదరాబాద్‌లో తేలనుంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నిషేధం తర్వాత గత ఏడాది ఐపీఎల్‌లో పునరాగమనం చేసి చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచి సూపర్‌ కింగ్స్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, కొలిన్‌ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్‌ చహర్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 62 బంతుల్లో 81 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు.  

పంత్‌ మినహా... 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగినప్పటి నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్‌ తడబడుతూనే సాగింది. మధ్యలో పంత్‌ ప్రయత్నం మినహా జట్టు బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. టాప్‌–4 బ్యాట్స్‌మెన్‌ నుంచి కనీసం ఒక్క సిక్సర్‌ కూడా రాకపోగా, స్కోరులో అత్యధిక భాగస్వామ్యం 22 పరుగులే అంటే పరిస్థితి అర్థమవుతుంది! శార్దుల్‌ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో ధావన్‌ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే చహర్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా (6 బంతుల్లో 5; ఫోర్‌) వికెట్ల ముందు దొరికిపోవడంతో ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. ముందుగా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా... ధోని రివ్యూ కోరి ఫలితం సాధించాడు. కొద్ది సేపటికి హర్భజన్‌ బౌలింగ్‌లో ధోని చక్కటి క్యాచ్‌ పట్టడంతో ధావన్‌ వెనుదిరిగాడు. అనంతరం భజ్జీని సమర్థంగా ఎదుర్కొని వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మున్రో... జడేజాకు తలవంచాడు. కెప్టెన్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 13; ఫోర్‌) పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మళ్లీ విఫలమయ్యాడు. ఈ దశలో జట్టు స్కోరు 75/4 కాగా... పంత్‌ 10 పరుగుల వద్ద ఆడుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్‌ (6 బంతుల్లో 3), రూథర్‌ఫోర్డ్‌ (12 బంతుల్లో 10; సిక్స్‌), కీమో పాల్‌ (7 బంతుల్లో 3) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పంత్‌ ధాటిని పెంచాడు. తాహిర్‌ ఓవర్లో వరుసగా అతను ఫోర్, సిక్స్‌ కొట్టడంతో కొంత ఊపు వచ్చింది. అయితే అది ఎంతో సేపు సాగలేదు. చివరకు బ్రేవో బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి పంత్‌ ఔటయ్యాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్లో బౌల్ట్‌ (3 బంతుల్లో 6) ఒక సిక్స్‌... చివరి రెండు బంతులకు ఇషాంత్‌ శర్మ (3 బంతుల్లో 10 నాటౌట్‌) వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టడంతో ఈ మాత్రం స్కోరైనా వచ్చింది. పంత్‌ వెనుదిరిగాక ఢిల్లీ చివరి 8 బంతుల్లో 24 పరుగులు రాబట్టగలిగింది. ఒక బ్యాట్స్‌మన్‌ (విజయ్‌)ను తప్పించి తుది జట్టులో పేసర్‌ శార్దుల్‌కు చోటిచ్చిన చెన్నై అతనితో ఒకటే ఓవర్‌ వేయించగా... ఈ సీజన్‌లో చాలా వరకు పేలవ ప్రదర్శన కనబర్చిన బ్రేవో (2/19) ఎట్టకేలకు తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.   

ఓపెనర్లు చెలరేగగా... 
తొలి నాలుగు ఓవర్ల పాటు కాస్త ప్రశాంతత... ఆ తర్వాత ఒక్కసారిగా చెన్నై ఓపెనర్లు చెలరేగిపోయారు. వరుసగా గత నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన వాట్సన్‌ ఫామ్‌ అందుకోగా, డు ప్లెసిస్‌ తన దూకుడును చూపించాడు. బౌల్ట్, ఇషాంత్‌ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 16 పరుగులే చేసింది. కానీ అక్షర్‌ వేసిన ఐదో ఓవర్‌తో ఆట మలుపు తిరిగింది. ఈ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ప్లెసిస్‌... ఇషాంత్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి మూడు బంతులను వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే ప్లెసిస్‌ను ఔట్‌ చేసి బౌల్ట్‌ తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని ముగించాడు. ఇక్కడి నుంచి బాధ్యత తీసుకున్న వాట్సన్‌... పాల్‌ వేసిన 12వ ఓవర్లో చెలరేగిపోయాడు. ఏకంగా 3 సిక్సర్లు, ఫోర్‌ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న తర్వాత మిశ్రా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వాట్సన్‌ వెనుదిరిగాడు. చివర్లో రైనా (13 బంతుల్లో 11), ధోని (9 బంతుల్లో 9) వెనుదిరిగినా చెన్నైకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. రాయుడు (20 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయంగా నిలవడంతో ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టు గెలిచింది.

ఆనవాయితీ  కొనసాగింది... 
ఐపీఎల్‌లో 2011 నుంచి ప్లే ఆఫ్స్‌ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఈ సీజన్‌ వరకు లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు కచ్చితంగా ఫైనల్‌ చేరుతోంది. 2011లో చెన్నై, 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, 2016లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్, 2018, 2019లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలవడంతో పాటు ఫైనల్‌కు చేరుకున్నాయి. మరో విశేషమేమింటే 2011 నుంచి 2015 వరకు వరుసగా ఐదేళ్లపాటు ఐపీఎల్‌లో లీగ్‌ దశ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టుకే టైటిల్‌ లభించింది.   

►4 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనుండటం ఇది నాలుగోసారి. 2010లో చెన్నై విజేతగా నిలువగా... 2013, 2015లలో ముంబై టైటిల్‌ సాధించింది. 

►4 ఐపీఎల్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో బౌలర్‌ హర్భజన్‌. ఈ జాబితాలో లసిత్‌ మలింగ (169 వికెట్లు), అమిత్‌ మిశ్రా (157 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా... పీయూష్‌ చావ్లా (150 వికెట్లు), హర్భజన్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. 

►2 ఐపీఎల్‌ చరిత్రలో 100 విజయాలు నమోదు చేసుకున్న రెండో జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ముంబై ఇండియన్స్‌ 106 విజయాలతో అగ్రస్థానంలో ఉంది.    

రనౌట్‌ చేయడంలో విఫలమై... 
గత కొన్ని మ్యాచ్‌లలో చెన్నైకి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోతున్నారు. ఆ ఒత్తిడి వారిపై ఆరంభంలోనే కనిపించింది. అయితే చేతికి చిక్కిన చక్కటి అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ వృథా చేసుకొని ఫలితం అనుభవించింది. ఇన్నింగ్స్‌ మూడో బంతికే రనౌట్‌ చేసే చాన్స్‌ వచ్చినా బుర్ర వాడకుండా ప్రత్యర్థికి లైఫ్‌ అందించింది. బౌల్ట్‌ వేసిన బంతిని పాయింట్‌ దిశగా ఆడి వాట్సన్, డు ప్లెసిస్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించారు. అయితే ఇద్దరిలో సమన్వయ లోపంతో గందరగోళానికి లోనై ఒక దశలో ఇద్దరు పిచ్‌ మధ్యలోకి వచ్చేశారు. అయితే ఢిల్లీ ఫీల్డర్లు సరైన రీతిలో త్రో వేయడంలో విఫలం కావడంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ క్షేమంగా బయటపడ్డారు. బంతిని ఆపి అక్షర్‌ పటేల్‌ నాన్‌స్ట్రయికింగ్‌ దిశగా విసరగా, అక్కడే ఉన్న మున్రో బ్యాట్స్‌మెన్‌ గమనాన్ని పట్టించుకోకుండా కీపర్‌ వైపు విసిరాడు. అది దూరంగా వెళ్లడంతో పంత్‌ కూడా దానిని అందుకోలేకపోయాడు. ఆలోగా ప్లెసిస్‌ వేగంగా వచ్చి పరుగు పూర్తి చేసుకోగా క్యాపిటల్స్‌ ఆటగాళ్లంతా తలలు పట్టుకున్నారు. మున్రో కాస్త చురుగ్గా ఆలోచిస్తే సునాయాసంగా రనౌట్‌ చేయగలిగే అవకాశం అక్కడ ఉంది. తొలి ఓవర్లోనే వికెట్‌ తీసి ఉంటే అసలే ఒక బ్యాట్స్‌మన్‌ తక్కువగా ఉన్న చెన్నైపై కచ్చితంగా ఒత్తిడి పెరిగేదే! 

మరిన్ని వార్తలు