చెన్నై సూపర్‌ ‘స్పిన్‌’ 

1 May, 2019 23:33 IST|Sakshi

తాహిర్, జడేజా స్పిన్‌ ఉచ్చులో ఢిల్లీ విలవిల

చెన్నైకి భారీ విజయం

మెరిసిన రైనా, ధోని  

చెన్నై సూపర్‌కింగ్స్‌ ముందు మెల్లగా ఆడింది. ఒకానొక సమయంలో అయితే మూడు ఓవర్ల పాటు ఓవర్‌కు పరుగు మాత్రమే చేసింది. కానీ ఢిల్లీ అలాకాదు దంచేసింది. ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడింది. కానీ అంతలోనే తాహిర్‌ (3.2–0–12–4) స్పిన్‌ మాయలో పడింది. ఆ తర్వాత ఎంతకీ తేరుకోలేక పరాజయం పాలైంది.  

చెన్నై: సూపర్‌కింగ్స్‌ మళ్లీ ‘టాప్‌’ లేపింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రైనా (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ ధోని (22 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచేశారు. సుచిత్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (31 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. ఇమ్రాన్‌ తాహిర్‌ (4/12) ఢిల్లీ మెడకు తన స్పిన్‌ ఉచ్చు బిగించాడు. మరో స్పిన్నర్‌ జడేజాకు మూడు వికెట్లు లభించాయి. ధోనికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

మందకొడిగా మొదలై... 
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆట చిత్రంగా సాగింది.  బ్యాటింగ్‌ కష్టంగా మొదలైంది. ఓవర్‌కు ఒక పరుగు మాత్రమే చేసింది. 3 ఓవర్లలో మూడే పరుగులు వచ్చాయి. 3 ఓవర్లపాటు 6 ఓవర్ల పవర్‌ ప్లేలో 27/1 స్కోరు చేసిన సూపర్‌కింగ్స్‌... చేతిలో వికెట్లున్నా 14 ఓవర్లలో చేసింది 2 వికెట్ల నష్టానికి 88 పరుగులే! అప్పటికీ వందయినా చేయలేదు. అయితే ఆలస్యంగా, ఆఖరికి బ్యాట్‌ ఝళిపించిన చెన్నై చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు చేయడంతో పోరాడే లక్ష్యాన్ని ఉంచగలిగింది. 

రైనా, ధోని మెరుపులు... 
ఓపెనర్లు వాట్సన్, డు ప్లెసిస్‌ పరుగులు చేసేందుకే ఆపసోపాలు పడ్డారు. దూకుడైన బ్యాట్స్‌మన్‌ వాట్సన్‌ ఏకంగా తొమ్మిది బంతులు ఆడినా ఖాతానే తెరువలేదు. నాలుగో ఓవర్లో అతను డకౌటయ్యాడు. ఎట్టకేలకు ఐదో ఓవర్లో బౌండరీ నమోదైంది. డు ప్లెసిస్, రైనా చెరో ఫోర్‌ కొట్టారు. ఆరో ఓవర్లో 2 ఫోర్లు వచ్చాయి. ఇదే జోరు మాత్రం కొనసాగలేదు. వికెట్లున్నా కూడా మరో 10 ఓవర్లు ఆడిన రైనా, డు ప్లెసిస్‌ జోడీ పెద్దగా పరుగులైతే చేయలేకపోయింది. డు ప్లెసిస్‌ (41 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను అక్షర్‌ ఔట్‌ చేశాడు. ధోని క్రీజులోకి వచ్చాక... సుచిత్‌  వేసిన 15వ ఓవర్లో రైనా వేగం పెంచాడు. వరుస మూడు బంతుల్లో 4, 4, 6 కొట్టి అర్ధసెంచరీని 34 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. కానీ ఐదో బంతికి ఔటయ్యాడు. జడేజా (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్న కాసేపు ధాటిగా ఆడాడు. 19వ ఓవర్లో ధోని 4, 6, రాయుడు 4 బాదడంతో 18 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్‌ను ధోని ఫోర్‌తో పాటు 2 సిక్సర్లతో ముగించాడు. ఈ ఓవర్లో 21 పరుగుల లభించడంతో స్కోరు అమాంతం పెరిగింది. 

ధాటిగా మొదలైతే... తాహిర్‌ తిప్పేశాడు 
తొలి ఓవర్లోనే పృథ్వీ షా (4) ఔటైనా... ఢిల్లీ లక్ష్యఛేదన ధాటిగానే సాగింది. ఓపెనర్‌ ధావన్‌ (13 బంతుల్లో 19; ఫోర్, సిక్స్‌), అయ్యర్‌ చకచకా పరుగులు సాధించారు. భజ్జీ వేసిన 4వ ఓవర్లో ధావన్‌ సిక్స్, ఫోర్‌ కొడితే... చహర్‌ ఐదో ఓవర్లో అయ్యర్‌ దాన్ని రిపీట్‌ చేశాడు. 5.1 ఓవర్లోనే జట్టు 50 పరుగులు చేసింది. అదే ఓవర్లో ధావన్‌ను హర్భజన్‌ ఔట్‌ చేయడంతోనే ఢిల్లీ పతనం కూడా మొదలైంది. ఏడో ఓవర్లో తాహిర్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదిన పంత్‌ (5) మరుసటి బంతికే నిష్క్రమించాడు.   

స్పిన్‌కు విలవిల 
టాపార్డర్‌ స్పిన్‌ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరైనా అయ్యర్‌ ఒంటరి పోరాటం చేశాడు. కానీ అవతలి నుంచి సరైన సహకారం కరువైంది. దీంతో జట్టును నిర్మించే భాగస్వామ్యం లేక ఢిల్లీ మూల్యం చెల్లించుకుంది. 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 80/4 కాగా... రెండు ఓవర్లకే 85/8 స్కోరుతో పరాజయానికి సిద్ధమైంది. 11వ ఓవర్లో తాహిర్‌ మొదట అక్షర్‌ పటేల్‌ (9), రూథర్‌ఫోర్డ్‌ (2)లను ఔట్‌ చేయగా... 12వ ఓవర్లో జడేజా తానేం తక్కువ కానని మోరిస్‌ (0)తో పాటు క్రీజులో పాతుకుపోయిన శ్రేయస్‌నూ పెవిలియన్‌ చేర్చాడు. టెయిలెండర్లు తర్వాత నాలుగు ఓవర్లు ఆడటంతో చెన్నై విజయం కాస్త ఆలస్యమైంది.  

మరిన్ని వార్తలు