సీఎస్‌కేను కట్టడి చేశారు..

17 Apr, 2019 22:06 IST|Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన సీఎస్‌కేకు ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం వాట్సన్‌(31) నదీమ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం తరువాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌(45)ను విజయ్‌ శంకర్‌ ఔట్‌ చేశాడు. ఓపెనర్లను ఔట్‌ చేసిన అనంతరం సన్‌రైజర్స్‌ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. 

ఈ క్రమంలో తాత్కాలిక సారథి సురేష్‌ రైనా(13)ను రషీద్‌ ఖాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవరల్లో కేదార్‌ జాదవ్‌(1)ను మరో అద్భుత బంతితో రషీద్‌ బోల్తా కొట్టించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న బిల్లింగ్స్‌(0) కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఓ వైపు వికెట్లు పడగొడుతూనే మరో వైపు పరుగులు ఇవ్వకుండా సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చివర్లో రాయుడు(25 నాటౌట్‌; 21 బంతుల్లో 2 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్‌ అహ్మద్‌, శంకర్‌, నదీమ్‌ తలో వికెట్‌ తీశారు.    

Liveblog

మరిన్ని వార్తలు